ఆదిలాబాద్ : రంగు మారిన సోయాబీన్ ( Soyabean ) కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బేల రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సోయా పత్తి పంటను ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. పంట కొనుగోళ్లలో పలు నిబంధనలు విధిస్తూ అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని, పంటలు మద్దతు ధరతో కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రంగు మారిన పంటలను కొనుగోలు చేశామని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకొచ్చే విధంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ కొనుగోలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి నష్టపోతున్నారని పేర్కొన్నారు. తేమ పేరిట పత్తి కొనుగోళ్లను సీసీఐ నిరాకరిస్తుందన్నారు. యాసంగి పంటలకు కరెంటు సరఫరా కాకపోవడంతో పంట నష్టపోతున్నారని వెల్లడించారు.
అసెంబ్లీలో సోయాబీన్ కొనుగోలు చర్చపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం దారుణమని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తున్నదని జోగు రామన్న తెలిపారు.