మునుగోడు నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి, అక్టోబర్ 20: మునుగోడు నియోజకవర్గ ప్రజలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విశ్వాసం లేదా? తాను నిర్వహించే ఉపఎన్నికల ప్రచారానికి మునుగోడు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాదని ఆయన ముందే ఊహించారా?.. గురువారం నాంపల్లిలో బీజేపీ నిర్వహించిన రోడ్షోని చూస్తే అవే అనుమానాలు కలుగుతున్నాయి.
నాంపల్లి మండలంలోని ఎస్ లింగోటం, వడ్డేపల్లి, చిట్టెంపాడు, నాంపల్లి గ్రామాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి బండి సంజయ్ రోడ్‌షో ఉంటుందని బీజేపీ తొలుత షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రోడ్‌షోలకు జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు అగచాట్లు పడ్డారు. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదన్న సమాచారంతో బండి సంజయ్.. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌ని వెంట తీసుకెళ్లారని తెలిసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా 60 నుంచి 70 కార్లతో ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరగా.. ఒక్కో కారులో ముగ్గురు నుంచి నలుగురు యువకులు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో నాంపల్లి గ్రామస్థుల నుంచి స్పందన లేకపోవడంతో.. పొరుగున ఉన్న అంగడిపేట, రాందాస్ తండా తదితర గ్రామాల నుంచి డీసీఎంలు, షేర్ ఆటోల్లో జనాన్ని నాంపల్లికి తరలించేలా ప్లాన్ చేశారు. అలా పొరుగు ఊళ్లనుంచి తీసుకువచ్చిన వారు సైతం రోడ్‌షో మధ్యలోనే తిరిగివెళ్లిపోవడం గమనార్హం. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఎస్ లింగోటంలో మధ్యాహ్నం 3 గంటలకు, వడ్డేపల్లిలో మధ్యాహ్నం 3.45గంటలకు, చిట్టెంపాడులో మధ్యాహ్నం 4.20కి, సాయంత్రం 5 గంటలకు నాంపల్లి మండల కేంద్రంలో సభ నిర్వహించాలి. అయితే బండి సంజయ్ తన అనుచరగణంతో ఎస్. లింగోటం గ్రామానికి సాయంత్రం 6.15 చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి కాన్వాయ్‌లో జనాన్ని తరలించే పనిలో బీజేపీ నాయకులు నిమగ్నమైనందువల్లే బండి పర్యటన ఆలస్యంగా ప్రారంభమైందని తెలుస్తున్నది.
ఈలలు, కేకలు.. ముందస్తు ఏర్పాట్లు!
సాధారణంగా బండి సంజయ్ రోడ్‌షోను టీవీల్లో చూస్తున్నవారికి.. ఈలలు, కేరింతలతో హంగామా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటుంది. అయితే ఇతర బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడూ లేని కేకలు బండి మైకందుకోగానే మొదలవుతాయి. ఆయన తన కాన్వాయ్‌ని ఆపి ప్రచార వాహనం ఎక్కేవరకు కొందరు కార్యకర్తలు వెంట తెచ్చుకున్న పటాకులను పేల్చుతారు. సంజయ్ మాట్లాడటం మొదలు పెట్టినప్పటినుంచీ అయిపోయేవరకు మాటకోసారి ఈలలు, కేకలు కొనసాగుతాయి. ‘ప్లీజ్..ఆగండి..పటాకులు కాల్చకండి’ అనగానే పటాకుల మోతలు మొదలవుతాయి. ఇవన్నీ వేటికవే జరిగిపోతుంటాయి. మునుగోడుకు ఏం చేశామో, ఇకముందు ఏం చేస్తామో చెప్పడానికి బదులు కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడమే తన ప్రసంగం అన్నట్టుగా బండి సంజయ్ ప్రచారంలో మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఉపన్యాసంలో తమకు ఉపయోగపడేదేమీ లేదన్న గ్రహిస్తున్న జనం చాలాచోట్ల రోడ్‌షో మధ్యలోనే తిరిగివెళ్లిపోతున్నారు.