Pregnant Woman | బాసర : ఓ నిండు గర్భిణి రైలు బోగీలో ప్రసవించింది. ఆ తర్వాత ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బాసర రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ధర్మాబాద్ మండలం కర్కెళ్లి గ్రామానికి చెందిన నాగేశ్వరి(32)కి నెలలు నిండాయి. అయితే చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వచ్చారు. చికిత్స అనంతరం తన సొంతూరికి వెళ్లేందుకు గర్భిణి.. కాచిగూడ – నాగర్సోల్ రైలు ఎక్కింది. బాసర రైల్వే స్టేషన్ సమీపంలో ఆమె పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో రైలు బోగీలోనే నాగేశ్వరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు రైల్వే పోలీసు సురేశ్‌కు సమాచారం అందించగా, స్టేషన్ మేనేజర్‌ను అలర్ట్ చేశారు. బాసర రైల్వే స్టేషన్లోనే రైలును కాసేపు నిలిపి.. బాలింతను ఆమె బిడ్డను అంబులెన్స్‌లో ఎక్కించి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ భైంసా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.