వరంగల్ : కుల కట్టుబాట్లు(Caste obligations) నిరాకరించాడని ఓ వ్యక్తికి కుల పెద్దలు రూ. 20 వేల జరిమానా విధించిన ఘటన వరంగల్(Warangal) జిల్లా నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు ముదిరాజ్ కులస్తుడు పోలుదాసరి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బోళ్ల నారాయణ సోమవారం ముదిరాజ్‌ల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి గుడి వద్ద పండుగ చేశాడు.
ఈ కార్యక్రమానికి ఇదే గ్రామానికి చెందిన పోలుదాసరి రవీందర్‌ను ఆహ్వానించగా వెళ్లి పూజలో పాల్గొన్నాడు. దీంతో ముదిరాజ్ కుల సంఘం పెద్ద మనుషులు పోలుదాసరి రంగన్న, సిద్ద సంతోష్, బండి సారయ్య, పోలుదాసరి భద్రయ్యతోపాటు మరికొందరు కుల కట్టుబాట్లను అతిక్రమించావంటూ మంగళవారం రవీందర్‌పై గ్రామంలో పంచాయతీ నిర్వహించారు.
రూ.50 వేల డిపాజిట్ పెట్టించి కుల తప్పు కింద రూ. 20 వేలు జరిమానా విధించారు. అతడు ఒప్పుకోక వెళ్లిపోయాడు. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, బాధితుడు పోలుదాసరి రవీందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉండగా, కాంగ్రెస్ కండువా వేసుకోలేదనే కక్షతోనే కుల పెద్దలు జరిమానా విధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.