TGSRTC | దంతాలపల్లి, మే 10 : రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఆర్టీసీ ఫ్రీ బస్సుతో సౌకర్యం మాటెలా ఉన్నా ఘర్షణలే ఎక్కువగా జరుగుతున్నాయి. శనివారం సూర్యాపేట డిపో ఎక్స్‌ప్రెస్ బస్సు హనుమకొండకు వెళ్లి సూర్యాపేటకు తిరిగి వస్తుండగా, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలో కొందరు బస్సు ఎక్కారు. జీరో టికెట్ కోసం ఓ మహిళ ఆధార్ కార్డును ఇచ్చింది.
పరిశీలించిన కండక్టర్ ఆధార్‌కార్డు అప్డేట్ కాలేదని, టికెట్‌కు డబ్బులివ్వాలని అడుగగా మరో ప్రయాణికుడు మహిళకు మద్దతుగా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో ప్రయాణికుడు, కండక్టర్ ఒకరి చొక్కా మరొకరు పట్టుకుని ఘర్షణపడ్డారు. దంతాలపల్లి పోలీసులు చేరుకుని కండక్టర్, ప్రయాణికుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.