Murder | చిట్యాల, ఫిబ్రవరి 26 : మంత్రాల నెపంతో వృద్ధురాలిని హత్య చేసిన ఘటన టేకుమట్ల మండలంలోని గర్మిళ్ళపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. బుధవారం చిట్యాల సర్కిల్ కార్యాలయంలో సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి సంపత్ రావు మాట్లాడారు.
డీఎస్పీ కథనం మేరకు.. టేకుమట్ల మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ(70) ఈనెల 19న చింతపండు అమ్ముకుంటూ పక్క గ్రామమైన గర్మిళ్లపల్లికి వెళ్లి అదృశ్యమైంది. తెల్లవారి తన కుమారులు ఇట్టి విషయాన్ని గుర్తించి వారి బంధువుల ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాలను వెతకగా ఆమె ఆచూకీ లభ్యం కాలేదన్నారు. కాగా ఈనెల 23న బోయినపల్లి, గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్న పసిక మనమ్మకు చెందిన వ్యవసాయ బావిలో నుండి వెలువడిన దుర్గంధ వాసనను గమనించిన బాటసారి బొయిని సంపత్ బావి దగ్గరకు వెళ్లి చూడగా ఒక గుర్తు తెలియని శవం నీటిపై తెలియాడుతూ కనబడినట్లు చెప్పారు.
దీంతో తాను గ్రామస్తులకు సమాచారం అందించగా గ్రామస్తులు వచ్చి అట్టి శవాన్ని బయటకు తీసి పరిశీలించగా అట్టి శవం సొరపక వీరమ్మదిగా గుర్తించినట్లు చెప్పారు. అట్టి మహిళను గుర్తు తెలియని వ్యక్తులు చంపి చేతులు వెనుకకు తాడుతో కట్టి గోనె సంచిలో కుక్కి బావిలో వేసినట్లుగా కుటుంబ సభ్యులు టేకుమట్ల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని పోలీసు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా గర్మిళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, ఇతర టెక్నికల్ సాక్షాలు ద్వారా కొంతమంది అనుమానితుల్ని విచారణ చేస్తుండగా బోయినపల్లి గ్రామానికి చెందిన బోయిన మల్లయ్య ఏ-1గా, పుట్టకొక్కుల శ్రీనివాస్ ను ఏ-2 గా, గర్మిమిళ్ళపల్లికి చెందిన మద్దెల సిద్దును ఏ-3లుగా పోలీస్ స్టేషన్ నందు లొంగిపోయినట్లు వెల్లడించారు.
బోయిని మల్లయ్య చిన్న కూతురుకి అనారోగ్యం కారణంగా ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన నయం కాకపోవడంతో తన ఇంటికి సమీపంలో నివాసముంటున్న సోరపాక వీరమ్మ మంత్రాలు చేస్తుందనే అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను చంపితే తన కూతురు ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మిన మల్లయ్య తన బంధువైన పుట్టకొక్కుల శ్రీనివాస్ అలియాస్ కిట్టు, కిట్టు స్నేహితుడైన మద్దెల సిద్ధుల సహాయం కోరగా వారు అందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. దాదాపు రెండు నెలల నుండి వీరమ్మ కదలికలను గమనిస్తూ ఈనెల 19న సాయంత్రం వీరమ్మ ఒంటరిగా గర్మిళ్లపల్లి వైపు వెళ్లడం చూసి ఇదే సరైన సమయం అని భావించి మల్లయ్య, కిట్టు ఇద్దరు కూడా సిద్దు బైక్ మీద వెళ్లి గర్మిళ్ళపల్లి సెంటర్ నుండి తిరిగి వస్తున్న వీరమ్మని వెంబడించి పసిక మనమ్మ వ్యవసాయ బావి వద్దకు రాగానే చుట్టుపక్కల ఎవరూ లేనిది గమనించి ఇద్దరు కలిసి వృద్ధురాలిని చెట్లపొదల్లోకి తీసుకెళ్లారు.
మల్లయ్య గొంతు నులమగా కిట్టు రెండు కాళ్లు చేతుల్ని పట్టుకున్నట్లు తెలిపారు. వృద్ధురాలు మృతి చెందిన తర్వాత ఆమె శరీరం పైన ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసు, 30 తులాల వెండి కడియాలు తీసుకొని సిద్దు ద్వారా గోనెసంచి, తాడు తెప్పించుకొని వీరమ్మ చేతులు కట్టేసి గోనెసంచిలో కుక్కి ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని బావిలో వేసి వెళ్లిపోయినామని నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు. దీంతో బుధవారం నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు డిఎస్పి పేర్కొన్నారు.
ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మవద్దని, దీనికి అపనమ్మకమే బలమైన కారణమని, ఆరోగ్య సమస్యలు అనేవి వారు నివసించే పరిసరాలు, వాతావరణ మార్పు, జన్యు సంబంధమైన కారణాలతో వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇట్టి కేసును త్వరితగతిన చేదించిన చిట్యాల సీఐ మల్లేశ్, టేకుమట్ల ఎస్సై సుధాకర్, సిబ్బంది ఏఎస్ఐ అమరేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, పోలీస్ సిబ్బంది మహేందర్, నాగరాజు, రంజిత్, సతీష్ లను డిఎస్పి అభినందించినారు.