హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో సుశిక్షితులైన నర్సుల కొరత తీవ్రమైంది. హైదరాబాద్‌లోని రెండు ప్రైవేట్ దవాఖానలు 50 మంది నర్సులను కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాయి. వారికి డాక్టర్లతో సమానంగా జీతాలు ఇస్తామని, వసతి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. భారీగా ఇన్సూరెన్స్ కూడా చేయించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు సుశిక్షితులైన నర్సుల కొరత ఎంతగా వేధిస్తున్నదో అర్థం చేసుకోవడానికి.
వైద్యరంగంలో డాక్టర్లు ఎంత ముఖ్యమో నర్సులకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. రోగిని 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతూ, సరైన సమయంలో మందులు ఇస్తూ ఆరోగ్యవంతులు అయ్యేలా చేసేది నర్సులే. మన దేశంలో 2024 నాటికి దాదాపు 43 లక్షల మంది నర్సుల అవసరం ఉంటుందని ఇటీవల ఒక అధ్యయన సంస్థ తెలిపింది. ఇంతటి ప్రాముఖ్యమున్న నర్సింగ్ రంగం ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైంది. డిమాండ్‌కు తగినట్టుగా నర్సింగ్ కాలేజీలను నెలకొల్పలేదు. దీంతో రాష్ట్రంలో నర్సుల కొరత పెరిగింది. మన రాష్ట్రంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నర్సుల కొరత వేధిస్తున్నది. భారతీయ నర్సులకు విదేశాల్లోని దవాఖానలు ఆకర్షణీయమైన వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తూ ఆహ్వానం పలుకుతున్నాయి. నర్సింగ్ విద్యతో మహిళలకు ఉపాధి పెరుగుతుందనేది తెలిసిన విషయమే.
నర్సింగ్ విద్య ప్రాధాన్యం, మహిళలకు లభించే అపార అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యవిద్యతో పాటు, నర్సింగ్ విద్యను పటిష్టం చేయాలని నిర్ణయించారు. నర్సుల సంఖ్యను పెంచేందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి 6 నర్సింగ్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వీటిలో మొత్తం సీట్లు 380 మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏడున్నరేండ్లలోనే 14 కాలేజీలు మంజూరు చేసింది. జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటుతో 33 కాలేజీలు, 3,300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకవైపు మెడికల్ కాలేజీలు, మరోవైపు నర్సింగ్ కాలేజీలతో వైద్యారోగ్య రంగం పటిష్టతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన కాలేజీలు రాజన్న సిరిసిల్ల, బాన్సువాడ, సంగారెడ్డి, మహబూబాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యవేక్షణలో కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటును ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. ఈ ఏడాది బడ్జెట్లో కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, మౌలిక వసతుల కోసం రూ.590 కోట్లు కేటాయించారు. కొత్త నర్సింగ్ కాలేజీల కోసం 816 రెగ్యులర్ పోస్టులను మంజూరు చేశారు. మరోవైపు నర్సింగ్ విద్యార్థుల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే వారి ైస్టెపెండ్ను పెద్దమొత్తంలో పెంచారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు గతంలో రూ.1,500 ఉంటే రూ.5 వేలకు, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.1,700 ఉండగా.. దానిని రూ.6 వేలకు, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.1,900 ఉంటే దానిని రూ.7 వేలకు నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి రూ.8 వేలకు పెంచారు.