హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): పదేండ్లలో కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్‌ను ఎంతగానో అభివృద్ధి చేశారని మోహన్ గురుస్వామి అనే ఓ నెటిజన్ ప్రశంసించారు. ఓ చిన్న గ్రామంగా ఉన్న గజ్వేల్‌ను సకల సౌకర్యాలతో పెద్ద పట్టణంగా తీర్చిదిద్దారని ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కితాబు ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తన నియోజకవర్గమైన కొడంగల్‌ను గజ్వేల్ మాదిరిగా అభివృద్ధి చేయడం ఓ సవాలేనని అభిప్రాయపడ్డారు. ‘నా పవర్ టిల్లర్ మరమ్మతు కోసం శనివారం గజ్వేల్ పట్టణానికి వెళ్లాను. పదేండ్ల క్రితం ఇది ఒక చిన్న పట్టణం లేదా పెద్ద గ్రామంలా మాత్రమే ఉండేది.
ఇప్పుడు ఇది అభివృద్ధి చెందిన పట్టణంగా మారింది. బాక్సీ ఆకారంలో ఉన్న ఆర్సీసీ భవనాలు, సరుకులతో నిండిన మారెట్లు, వెలుగు జిలుగుల లైట్లతో కూడిన రహదారులు, నీటి కాలువలు, నిండుగా ఉన్న చెరువులు, ఆటస్థలాలు, అనేక భోజనశాలలు, అంతేకాదు ఒక మంచి పరిమాణంలో ఉన్న అర్బన్ ఫారెస్ట్ కూడా కనిపిస్తున్నది. సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసే రెండు భారీ జలాశయాలు ఈ పట్టణానికి రెండువైపులా ఆనుకొని ఉన్నాయి.
గజ్వేల్.. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియోజకవర్గం కూడా. మార్పు ఇంత స్పష్టంగా కనిపించడంలో ఆశ్చర్యమేముంది! సికింద్రాబాద్‌కు ఉత్తర దిక్కున సుమారు 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణం సిద్దిపేట జిల్లాలోని ఒక మున్సిపాలిటీ, మండలకేంద్రం మాత్రమే. గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(జీఏడీఏ) ద్వారా మౌలిక వసతుల్లో పెద్దఎత్తున అభివృద్ధి జరిగింది. ఇంటిగ్రేటెడ్ మారెట్, అభివృద్ధి చెందుతున్న విద్యాకేంద్రం, కొత్త బస్టాండ్ ఇందులో ముఖ్యమైనవి.
హైదరాబాద్‌తో మంచి రహదారి ఉండటమే కాకుండా మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ గజ్వేల్ గుండా వెళ్లడంతో రైల్ కనెక్టివిటీ మెరుగుపడుతున్నది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నుంచి వచ్చిన సీఎం ఉన్నారు. గజ్వేల్ గత దశాబ్దంలో సాధించిన అభివృద్ధిని కొడంగల్‌లో పునరావృతం చేయడం రేవంత్‌రెడ్డికి పెద్ద సవాలే’ అని గురుస్వామి చెప్పుకొచ్చారు.