రికార్డుల్లోని లొసుగుల ఆధారంగా తనది కాని భూమిని మింగేస్తే! అక్రమంగా చెరబట్టిన ఎకరాలను అడ్డదారిలో సర్కార్కే అమ్మేస్తే! తప్పు అని తెలిసినా.. రేపు కోర్టుల్లో కొట్టివేత తప్పదని తెలిసినా.. ప్రాజెక్టును, ప్రజాధనాన్ని పణంగా పెడితే! పరిహారాన్ని ఫలహారంగా పంచిపెడితే..! ఇది ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కథ! ఇప్పటికే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద కేంద్ర ప్రభుత్వం అమ్ముకున్న విషాదం నుంచి ఇంకా తేరుకోని ఆదిలాబాద్ జిల్లాను.. మరో పారిశ్రామికవాడ పేరుతో వంచించే పన్నాగమిది! వెలుగును ఆశచూపించి నీడను మింగే నయవంచనిది! కాంగ్రెస్-బీజేపీ నేతలు కలిసి అల్లుతున్న జాలమిది!
ఇది ప్రభుత్వ పెద్దల భూకుంభకోణాల్లో మరో కోణం
కాంగ్రెస్-బీజేపీ చీకటి బంధానికి నిలువెత్తు నిదర్శనం
బ్యాంకుల్లో తనఖా పెట్టిన భూములపై బీజేపీ నేత తన తడాఖా చూపించాడు. రైతుల నుంచి అగ్గువకు కొనేసి, కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట మార్చుకున్నాడు. ఏండ్లు గడిచి పోయాయి. ఇప్పుడాయన ఎమ్మెల్యే! ఆ భూములను ఏం చేయాలో ఆలోచించాడు. అధికార పార్టీ ముఖ్యులతో కలిసి ప్లాన్లు గీశాడు. సొంత పార్టీ నేతలకే అపాయింట్‌మెంటూ దొరకని స్థితిలో.. ముఖ్యమంత్రినే వెంటబెట్టుకుని ఏకంగా ఏరియల్ సర్వే కూడా చేయించాడు. అలా ఆకాశంలోనే వేల ఎకరాల ‘ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్’ ఆలోచన మొగ్గ తొడిగింది. భూమ్మీదికి రాగానే భూముల మీదికి మనసు మళ్లింది. ఆ ఎమ్మెల్యే సంబంధీకుల భూములే కేంద్రంగా రూ.వేల కోట్ల ప్రాజెక్టుకు ముగ్గు పోశారు. ఇప్పటికే 2,200 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. మరో 1,022 ఎకరాల విస్తరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో మూడు వేల ఎకరాల సేకరణకు ప్లాన్లు గీస్తున్నారు. భూసేకరణ ముసుగులో ప్రభుత్వం నుంచి ఆ తనఖా భూములకు భారీగా పరిహారం పొందడం.. పార్క్ అభివృద్ధి టెండర్లను చేజిక్కించుకుని వేల కోట్లు వెనుకేసుకోవడం! ఇదీ లోగుట్టు! కాంగ్రెస్-బీజేపీ కలిసికట్టు కనికట్టు!
వడ్డించే వాడికీ వాటాలిస్తే.. కోట్లు మింగేందుకు గేట్లెత్తుతాడు!
రాజకీయ దూరాన్ని పక్కకుపెట్టి.. జనాన్నీ, ఖజానానీ మాయచేస్తాడు!

సీఎం పర్యటన అనంతరం నెలన్నర తర్వాత ఫిబ్రవరి 26న ఇండస్ట్రియల్ పార్క్ భూముల ఏరియల్ సర్వే కోసం ఆదిలాబాద్ వచ్చిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎమ్మెల్యే పాయల్ శంకర్

జనవరి 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చనాక-కొరాట బరాజ్ నుంచి హాథీఘాట్ పంప్‌హౌస్ ద్వారా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఇదే వేదికగా తనకు సంబంధించిన వేల ఎకరాలను కలుపుకొని పార్క్ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించారు.. ఏరియల్ వ్యూ ద్వారా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ముఖ్యులకు భూములు చూపించారు.
ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు.. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోరజ్, భీంపూర్, తాంసి మండలాల పరిధిలోనే 6 వేల ఎకరాల సేకరణకు నిర్ణయం
బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన భూములను బెంగళూరు కంపెనీ వేలంలో దక్కించుకొన్నా..పట్టించుకోకుండా వాటితో కథ నడిపిన ఎమ్మెల్యే
బ్యాంకుల్లో తనఖా ఉన్న భూములు, రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేరిటే ఉండటంతో వారికి ఎంతో కొంత ముట్టజెప్పి కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల పేరిట వేల ఎకరాల రిజిస్ట్రేషన్
వివాదాస్పద నిర్ణయాల్లో ప్రముఖంగా వినిపించే డెక్కన్ సిమెంట్స్ పేరిట ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల నుంచి చకచకా భూముల బదలాయింపు
మేలో తొలివిడతగా 2,026 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్.. తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ఒకేసారి
6 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం.. దీంతో రెండో దఫా 1,022 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు
భూ సేకరణలో పరిహారం కింద రూ.వందల కోట్లు జేబుల్లోకి మళ్లించుకునే పన్నాగం భూ సేకరణ పూర్తి చేసి.. ఇండస్ట్రియల్ పార్క్ లే అవుట్ అభివృద్ధి, టెండర్ల పేరిట వేల కోట్లు కొల్లగొట్టే ప్లాన్
బ్యాంకు తనఖాలో ఉన్న, ఎన్సీఎల్టీ వేలంలో అమ్ముడు పోయిన వేలాది ఎకరాల భూములతో పార్క్ ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో పాటు కోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోయే ప్రమాదం ఉన్నది.
విశ్వనగరం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను చెరపడుతున్న కాంగ్రెస్ సర్కార్ పెద్దలు.. మారుమూల ప్రాంత భూములనూ వదలడం లేదు. ఆదిలాబాద్ జిల్లా అడవుల వరకు తమ భూముల కుంభకోణాలను విస్తరింపజేస్తున్నారు. ఈ దఫా బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి ఒకటీఅరా కాదు.. ఏకంగా వేల ఎకరాల బ్యాంకు తనఖా భూములను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధంచేశారు. రూ.వందల కోట్ల నష్టపరిహారం కింద ప్రజాధనాన్ని జేబుల్లో వేసుకోవడంతోపాటు ఇండస్ట్రియల్ పార్క్ పేరిట వేల కోట్ల టెండర్లు కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
గతంలో బ్యాంకు తనఖా భూములను అక్రమ రిజిస్ట్రేషన్లతో అగ్గువకు కొట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే.. తాజాగా ఆ భూములను ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ కింద చూపి కోట్ల రూపాయల పరిహారాన్ని పొందేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా సర్కార్‌లోని ‘ముఖ్యనేత’ కోటరీ కూడా రంగంలోకి దిగి ఓ సిమెంట్ కంపెనీ పేరిట ఆ పరిహారాన్ని జేబులో వేసుకునేందుకు ప్రణాళిక రూపొందించడం గమనార్హం.
బ్యాంకు తనఖా భూములను ఎన్సీఎల్టీ ఈ-వేలంలో దక్కించుకున్న బెంగళూరు కంపెనీ నిబంధనల మేరకు తమ పేరిట ఆ భూములను మ్యుటేషన్ చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదు. కండ్ల ముందు ఓ కార్పొరేట్ కంపెనీ అవి తమ భూములంటూ ఆధారాలు చూపుతున్నా సర్కార్ పెద్దల ఒత్తిడితో రెవెన్యూశాఖ ఆ భూములను ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేస్తుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది.
ఇప్పటికే తొలి విడతగా మూడు వేల ఎకరాల సేకరణకు రంగం సిద్ధంకాగా… రెండో దఫాలో మరో మూడు వేల ఎకరాల సేకరణకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు 2200 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికే రూ.3వేల కోట్లు వెచ్చించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆరు వేల ఎకరాలకు ఈ మొత్తం ఏకంగా రూ.పది వేల కోట్ల వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే మరి… రేపటినాడు ఈ-వేలంలో ఆ భూముల్ని కొనుగోలు చేసిన కంపెనీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇండస్ట్రియల్ పార్కు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇవన్నీ తెలిసినా సర్కారు పెద్దలు ఈ దుస్సాహసానికి ఒడిగడుతున్నారంటే అసలు లక్ష్యం… ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటా? దాని పేరిట వేల కోట్ల పరిహారం, అభివృద్ధి పనుల నిధుల పంపకాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ టాస్క్బ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామంటూ కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోని భోరజ్, భీంపూర్, తాంసి మండలాల పరిధిలోనే ఆరు వేల ఎకరాలను సేకరించేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే భోరజ్ మండల పరిధిలోని హాథీఘాట్, గుడ, రాంపూర్, గిమ్మ(బి) గ్రామాల్లోనే మూడు వేల ఎకరాలకు పైగా సేకరించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. మొద టి విడతగా 2,026 ఎకరాలకు జీవో జారీ చేయడంతోపాటు భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 1,022 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును విస్తరిస్తామంటూ జీవో జారీ చేశారు. వీటికోసం త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇంతటితో ఆగకుండా.. పారిశ్రామికవాడ విస్తరణ పేరిట ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోనే ఆరు వేల ఎకరాలభూమిని సేకరించేందుకు ప్రభు త్వం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.
ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర ఒత్తిడి తెస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా అడుగులు వేస్తున్నది.
మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో పారిశ్రామికాభివృద్ధి జరగాలనుకోవడం మంచిదే. కాకపోతే ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేందుకు ఒకేదఫాగా పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు ఎంతవరకు ముందుకొస్తారనేది అందరికీ ఉన్న అనుమానం. ఈ నేపథ్యంలో తొలుత కొంతమేర విస్తీర్ణంలో ఏర్పాటు చేసి.. ఆపై దానిని దశల వారీగా విస్తరించేలా సర్కార్ కార్యాచరణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఆదిలాబాద్‌లో నిర్మించనున్న విమానాశ్రయంలో విమానాలు ఎక్కేందుకు మనుషులు కావాలంటే ఇండస్ట్రియల్ పార్క్ కావాలని, అందుకే పదివేల ఎకరాల్లో దానిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించడం.. పలుపు కోసం బర్రెను కొన్నట్టుగా ఉందని పారిశ్రామికవేత్తలే పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అత్యంత కీలకమైన నాచారం, జీడిమెట్ల, పటాన్చెరు, పాశమైలారం, చర్లపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌ల మొత్తం విస్తీర్ణమే 5,137 ఎకరాలు. ఈ స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు 3-4 దశాబ్దాలకుపైగా సమయం పట్టి ంది. అలాంటిది ఆదిలాబాద్ వంటి జిల్లాలో ఒకేసారి పదివేలఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ప్రకటించడం వెనక ఆంతర్యమేముంటుందనే సందేహాలు చాలాకాలంగా ఉన్నాయి. అక్కడ తవ్వితే.. అసలు గుట్టు బయటపడింది.

ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామంటూ చేసిన ప్రకటన వెనుక భూబాగోతమే దాగి ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న భూముల్లో దాదాపు రెండు వేల ఎకరాల వరకు భూములను రెండు దశాబ్దాల కిందటనే ఓ సంస్థ కొనుగోలు చేసింది. సదరు సంస్థ ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టగా… చివరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిర్వహించిన ఈ-వేలంలో బెంగళూరుకు చెందిన కంపెనీ దక్కించుకున్నది. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేస్తుండటం పలు అనుమానాలు, అనేక ఆరోపణలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ భూముల కథ ఏమిటనే దానిపై ఆరా తీస్తే… రెండు దశాబ్దాల వ్యవహారమంతా బయటపడింది. 20 ఏండ్లుగా ఈ భూముల చుట్టూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేపథ్యమే అల్లుకుని ఉన్నది. తీగలాగితే డొంక కదలింది! ఆదిలాబాద్వాసి గౌరీశంకర్‌కు చెం దిన జీఎస్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాల కిందటే సుమారు 2,200 ఎకరాలకు పైగా భూములను కొనుగోలు చేశారు. జైనథ్ మండలం గూడ గ్రామంలోనే 224 ఎకరాల వరకు కొనుగోలు చేశారు. ఇదే మండలంలోని హాథీఘాట్ గ్రామ పరిధిలోనూ 340ఎకరాలు కొనుగోలు చేశారు.
ఈ భూములన్నింటినీ వార్ధాలోని యూకో బ్యాంకు, ఆదిలాబాద్‌లోని ఎస్బీహెచ్ (ఇప్పుడు ఎస్బీఐ), సోమాజిగూడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (ఎస్బీఎం), సికింద్రాబాద్‌లోని కెనరా బ్యాంకుల్లో తాకట్టు (మార్టిగేజ్) పెట్టి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.
ఇందులో కీలకమైన అంశమేమిటంటే.. ఆయా గ్రామాల్లో రైతుల నుంచి కేవలం రూ.20-40వేలకు ఎకరా చొప్పున అప్పట్లో కొనుగోలు చేసిన జీఎస్ బయోటెక్ లిమిటెడ్.. బ్యాంకుల్లో తనఖా పెట్టే సమయంలో మాత్రం వాటి విలువను ఎకరానికి లక్ష రూపాయలుగా చూపించి, కోట్ల రూపాయల రుణాలను సంస్థ తీసుకున్నదని తెలిసింది. కాలక్రమేణా ఆ కంపెనీ దివాలా తీసింది. చివరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దాడులు చేసి.. ఆ సంస్థ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు చేసిన 2,200 ఎకరాలతోపాటు మహారాష్ట్ర నాందేడ్‌లో కొన్న భూములు, ఇతర ప్రాంతాల్లోని ఆస్తుల్ని అటాచ్ చేసింది. అనంతరం ఆయా బ్యాంకులకు బాకీపడిన రుణాల చెల్లింపును పూర్తిచేసేందుకు బ్యాంకుల కన్సార్షియం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వినతిపై లిక్విడేటర్‌ను ఏర్పాటుచేసింది. ఈడీ అనుమతితో ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 2,200 ఎకరాలకు నిర్వహించిన ఈ-వేలాన్ని బెంగళూరుకు చెందిన ఎక్స్-ఫ్యాక్టర్ కమల్ ట్రేడర్స్ రూ.40 కోట్లకు దక్కించుకున్నట్టు తెలిసింది. అంటే నిబంధనల మేరకు ఆ భూములన్నీ ఎక్స్-ఫ్యాక్టర్ కమల్ట్రేడర్స్కు చెందాల్సి ఉంటుంది.

గత ఏడాది జీఎస్ బయోటెక్ లిమిటెడ్ భూముల ఈ-వేలంలో పాల్గొని సక్కెస్ బిడ్డర్‌గా నిలిచినట్లు బెంగళూరుకు చెందిన ఎక్స్-ఫ్యాక్టర్ కమల్ ట్రేడర్స్‌కు రాసిన లేఖ
జీఎస్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ యజమాని గౌరీశంకర్‌కు ఆదినుంచీ ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత పాయల్ శంకర్‌తో మంచి సంబంధాలున్నట్టు తెలిసింది. ముఖ్యంగా గ్రామాల్లో ఆ కంపెనీ రైతుల నుంచి భూములను కొనుగోలు చేయడంలో పాయల్ శంకర్ మధ్యవర్తిత్వం వహించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఏయే గ్రామంలో ఆ కంపెనీ ఎంత విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేసిందనే వివరాలు దాదాపుగా శంకర్‌కు తెలుసు. అయితే జీఎస్ బయోటెక్ లిమిటెడ్ రైతుల నుంచి భూములను కొనుగోలు చేసే సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం సేల్‌డీడ్ మాత్రమే చేసుకున్నది. ఆ డాక్యుమెంట్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నది. కానీ రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసి భూములను కంపెనీ పేరిట మ్యుటేషన్ చేయించుకోకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములన్నీ పాత రైతుల పేర్ల మీదనే వస్తున్నాయి. ఫలితంగా 2018 తర్వాత ధరణిలోనూ రైతుల పేర్లు రావడంతో ఆ భూములపై కొత్త పాసు పుస్తకాలూ వచ్చాయి.
ఈ విషయాన్ని పసిగట్టిన పాయల్ శంకర్.. తన బంధువులతో కలిసి ఆ రైతులకు ఎంతోకొంత ముట్టజెప్పి, అగ్గువకు ఆ భూములను దక్కించుకున్నారు.
వాస్తవానికి బ్యాంకుల్లో తనఖా ఉన్న భూములను తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేయొద్దు. రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈసీని పరిశీలించాలి. కానీ పాయల్ శంకర్ ‘ఓ పద్ధతి’ ప్రకారం వ్యవహారం నడుపడంతో బ్యాంకుల్లో తనఖా ఉన్న భూములు వేల ఎకరాల్లో కుటుంబసభ్యులు, బంధువులు, బినామీలు, అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలుస్తున్నది. జీఎస్ బయోటెక్ లిమిటెడ్ ఇలా బ్యాంకుల్లో కుదువ పెట్టిన భూముల్లో భీంపూర్, భోరజ్ మండలాల పరిధిలోనే దాదాపు 1,200 ఎకరాల వరకు భూములను పాయల్ శంకర్ బంధువులు, బినామీల పేరిట మారినట్టు స్థానికంగా ప్రచారంలో ఉన్నది.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు శరత్ నుంచి డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి భూ బదిలీ
ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధీకుల పేరిట ఉన్న ఈ భూములు స్థానిక మార్కెట్ ప్రకారం రూ.4-4.50 లక్షల వరకు ధర పలుకుతున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరం రూ.3.50 లక్షలుగా ఉన్నది.
అయితే వీటినుంచి ఒకే దఫాలో కాసులు పిండుకోవాలంటే ప్రభుత్వపరంగా భూసేకరణ చేపడితే ప్రయోజనమని, పరిహారం కింద ఎకరానికి సుమారు రూ.18 లక్షల చొప్పున కోట్లు కొల్లగొట్టవచ్చని స్కెచ్ వేసినట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకే ఇండస్ట్రియల్ పార్క్‌ను తెరపైకి తెచ్చారనే ఆరోపణలున్నాయి.
అయితే ఈ ఏడాది జనవరి 16న సీఎం రేవంత్‌రెడ్డి చనాకా-కొరాట బరాజ్ నుంచి హాథీఘాట్ పంపుహౌస్ ద్వారా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగానే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు బీజంపడినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా తనకు సంబంధించిన వేల ఎకరాలను కలుపుకొని పార్క్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న భావించిన పాయల్ శంకర్.. సీఎం దగ్గర ప్రస్తావించడంతోపాటు, ముఖ్యమంత్రికి ఏరియల్ వ్యూ ద్వారా ఆ భూములను చూపించారని సమాచారం. తదనుగుణంగానే ఇండస్ట్రియల్ పార్కునకు అధికారికంగా రంగం సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం అప్పట్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని సైతం విస్మయానికి గురిచేసింది. అంతేకాదు.. తదుపరి అసెం బ్లీ సమావేశాల్లోనూ వారిద్దరూ పరస్పరం ప్రశంసించుకోవడమూ చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ బంధువు ఉగ్గె సత్యనారాయణ నుంచి డెక్కన్ సిమెంట్స్ పేరు మీదికి భూ బదిలీ
అసలు ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏయే కంపెనీలు వస్తాయనే దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో స్పష్టత లేనట్టు తెలిసింది. రెడ్, ఆరెంజ్, యెల్లో క్యాటగిరీ కంపెనీలని మాత్రమే అందులో పేర్కొన్నట్టు సమాచారం. చనాక-కొరాట సాగునీటి ప్రాజెక్టుకు అత్యంత చేరువలో ఉన్న ఈ భూముల్లో రెడ్ కేటగిరీ కంపెనీలు ఏర్పాటు చేస్తారనడంపైనా విమర్శలు వస్తున్నాయి. అయితే అసలు ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి ఉన్నదా? లేక పరిహారం, అభివృద్ధి టెండర్లతో వేల కోట్ల ప్రయోజనాలే పరమావధినా? అనే సందేహాలూ లేకపోలేదు. 2,200 ఎకరాలకు రూపొందించిన డీపీఆర్‌లోనే లేఅవుట్ అభివృద్ధికి రూ.3 వేల వరకు ఖర్చుచేసేలా అంచనాలు రూపొందించినట్టు తెలిసింది. ఈ క్రమంలో 6 వేల ఎకరాల విస్తీర్ణానికి.. ఈ మొత్తం కనీసం రూ.7-8 వేల కోట్లకుపైగా ఎగబాకే అవకాశమున్నది. అంటే చకచక భూసేకరణ పూర్తిచేసి.. లేఅవుట్ అభివృద్ధి పేరిట రూ.వేల కోట్ల పనుల్ని ఫలహారంగా పంచుకునే ప్రణాళిక కూడా ఉండి ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఇంతటి స్థాయి లో ప్రభుత్వంనిధుల్ని వెచ్చించిన తర్వాత.. ఈ-వేలంలో భూములను కొనుగోలు చేసిన కంపెనీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తే? కోర్టు ఆదేశాలతో వచ్చి భూముల్లో కూర్చుంటే? ప్రభుత్వ నిర్ణయ ం వల్ల రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా కాదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పలు వివాదాస్పద నిర్ణయాల్లో ‘డెక్కన్ సిమెంట్స్’ సంస్థ పేరు అనేకమార్లు వినిపించింది. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ వ్యవహారంలోనూ డెక్కన్ సిమెంట్స్ మరోమారు తెరపైకి వచ్చింది. రహస్య ఏరియల్ సర్వే తర్వాత ప్రభుత్వ పెద్దలే డెక్కన్ సిమెంట్స్‌ను రంగంలోకి దింపినట్టు సమాచారం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబసభ్యులు, బినామీల పేరిట రెండోసారి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు.. డెక్కన్ సిమెంట్స్ రాకతో ఆ కంపెనీ పేరు మీదకు చకాచకా మారిపోయాయి. ఇలా వంద ఎకరాలకు పైగా భూములు డెక్కన్ సిమెంట్స్‌కు బదలాయింపు జరిగినట్టు పలు ఆధారాలున్నాయి. ఈ పరిణామంపైనా పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు పెద్దలు కానీ, వారి బంధువులు గానీ ఈ భూములను నేరుగా బదలాయించుకుంటే.. వ్యవహారం బయటకుపొక్కి రచ్చ రచ్చయ్యే ప్రమాదముందన్న కారణంతోనే డెక్కన్ సిమెంట్స్‌ను రంగంలోని దింపారని ప్రచారం జరుగుతున్నది. భవిష్యత్తులో భూముల కేటాయింపు నుంచి ఇతర ఫ్యాక్టరీల ఏర్పాటు వరకు ఆ కంపెనీని ముందు పెట్టి తెరవెనుక పెద్దలు భారీ ప్రయోజనాలకు ప్రణాళిక సిద్ధంచేశారనే సందేహాలు వినిపిస్తున్నాయి.

ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్కు కోసం 2206 ఎకరాల సేకరణకు అనుమతినిస్తూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు