హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని, శాంతి, సార్వభౌమత్వం, ప్రజల ఐక్యత కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
అమెరికా సామ్రాజ్యవాద యుద్ధ్దోన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని కార్మికవర్గం, ప్రజాస్వామ్యవాద శక్తులు, శాంతిప్రియులు ఐక్యంగా గళం వినిపించాలని కోరారు. యుద్ధాన్ని ప్రోత్సహించే రాజకీయాలను ఖండిస్తూ.. ప్రపంచ శాంతి కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు టీ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.