దేవరుప్పుల, డిసెంబర్ 27 : ‘పింఛన్ పెంచుతమంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినం సారూ.. రేవంత్‌రెడ్డి మాటలు విని మోసపోయినం.. ఏడాదైంది..గదే రెండు వేలు.. అదే మూడు వేలు.. ఇగ పెంచుతడన్న ఆశ చాలిచ్చుకున్నం.. ఒక్కశిత్తం చేసుకున్నం సారూ.. కేసీఆరే మంచిగుండె.. ఊర్లు బాగుపడ్డయ్. అడుగకముందే ఇంటింటికీ నీళ్లిచ్చిండు.. చెరువులు నింపిండు.. రైతుబంధు ఇచ్చిండు… అన్ని సౌలతులు చేసిండు.. అంతా ఆగమైయింది సారూ’.. అంటూ పలువురు పింఛన్‌దారులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎదుట మొరపెట్టుకున్నారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాపురం దారిలో పోతున్న ఎర్రబెల్లికి ఆ ఊరిలో ఫించనుదారులు తారసపడగా, వారి మధ్య జరిగిన సంభాషణ ఇది.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలపై సానుభూతి చూపి, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3 వేలు ఇస్తేనే, వారంతా సమాజంలో గౌరవంగా బతుకుతారనే ఉద్దేశంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పింఛన్లు పెంచినట్టు తెలిపారు. ‘మాయమాటలు నమ్మి ఆయనను ఓడగొట్టిండ్రు. ఇక నేను ఎంత అభివృద్ధి చేసినా అది జనం పట్టించుకోలే.. కేవలం రేవంత్‌రెడ్డి మాటలు.. ఆరు గ్యారెంటీలు మీ చెవుల్లో ఊదరగొడితే ఓట్లు గుద్దిండ్రు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఏ ఒక్కటీ అమలు కాలే.. జనం చెవిలో పువ్వులు పెట్టి గెలిచిన రేవంత్‌రెడ్డికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం నిలదీస్తారు. పింఛనుదారులతో పాలకుర్తి నియోజకవర్గ స్థాయిలో భారీఎత్తున ధర్నా చేయాల్సిన సమయం వచ్చింది’ అని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. మరోవైపు రైతు భరోసా అమలులేదని, దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతపై ఈ ప్రభుత్వానికి ద్వేషమెందుకని ప్రశ్నించారు. ‘రైతు భరోసాను ఐదెకరాలకే ఇస్తాం.. ఏడెకరాలకే అందిస్తాం’ అంటూ చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. ఎకరాలను పక్కన బెట్టి, తనకున్న భూమిని సాగు చేస్తున్న రైతులకు ఇచ్చినమాట మేర రూ.15వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్యారెంటీలు అమలు చేసేవరకు నిలదీస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.