కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఆన్ లైన్ బెట్టింగ్‌లో(Online betting) ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్(Asifabad Dist) జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జైనూర్ ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన గుగ్గె కిరణ్ (26) అనే వ్యక్తి గత 5సంవత్సరాల నుండి వ్యాపార నిమిత్తం కోసం కెరమెరి మండలానికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ ఉండేవాడు. దీంతో ఆన్లైన్ బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక మద్యానికి బానిసయ్యాడు.
ఈనెల 21న కిరణ్ ఇంటి నుంచి ద్విచక్ర వాహనం ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి అదిలాబాద్ వెళ్తా అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కిరణ్ తన భార్య శీతల్‌కు ఫోన్ చేసి జైనూర్ మండలంలోని కాశీ పటేల్ గూడా సమీపంలో పురుగుమందు తాగి ఉన్నాను అని చెప్పడంతో ఆమె భార్య శీతల్ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కిరణ్ ను వెంటనే జైనూర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుడి భార్య శీతల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.