Telangana | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తొలి ఏకాదశి సందర్భంగా నదీస్నానం చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్‌పై వెళ్తున్న అతనిపై వెనుక నుంచి మరో బైక్‌లో వచ్చి కత్తితో దాడి చేసి చంపేశారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా అల్వాల్‌పాడు గ్రామంలో బొల్లిగొర్ల వెంకన్న (44) తన భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. తొలి ఏకాదశి కావడంతో కృష్ణానదిలో స్నానం చేసేందుకు గురువారం ఉదయం అడవిదేవులపల్లి మండలం సత్రశాలకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. వెంకన్న వెంటన అతని బామ్మర్ది రావుల కోటయ్య కూడా వెళ్లాడు. కోటయ్య వాహనం నడుపుతుండగా వెంకన్న వెనుక కూర్చొన్నాడు. వీళ్లిద్దరూ అల్వాల్‌పాడు దాటి చెన్నాయిపల్లి గ్రామ పరిధిలోని అడ్డరోడ్డు సమీపంలోకి రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వెంకన్న మెడపై కత్తితో దాడి చేశారు.
కత్తి తగలగానే వెంకన్న బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. ఇది చూసి భయభ్రాంతులకు గురైన కోటయ్య సమీపంలోని పొలాల్లోకి పారిపోయి గ్రామస్తులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారందరిని వెంటబెట్టుకుని ఘటనాస్థలికి వచ్చేసరికి వెంకన్న రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వెంకన్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హాలియా సీఐ గాంధీ, త్రిపురారం ఎస్సై శోభన్‌బాబు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.