Suicides : కేశంపేట (Keshampet) మండల కేంద్రంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి, శామీర్‌పేట (Shameerpet) మండలం అలియాబాద్‌లో ఓ మహిళ ఉరేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండల కేంద్రానికి చెందిన గుంటి ఆంజనేయులు (Gunti Anjaneyulu) మద్యానికి బానిసయ్యాడు. పైగా గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఇంటో ఉన్న పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన అతడిని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుని భార్య గుంటి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మరో ఘటనలో ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ హారిక కథనం ప్రకారం.. శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన భీమిరెడ్డి నాగిరెడ్డి, భీమిరెడ్డి పావని (25) (Bhimireddy Pavani) దంపతులకు ఇద్దరు సంతానం. గురువారం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా.. భార్య పావని ఉరేసుకుంది. ఆర్థిక ఇబ్బందలతోపాటు, ఇతర సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శామీర్‌పేట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం వెలుగు చూసింది. అలియాబాద్లోని పిస్తాహౌస్ వెనుక ప్రాంతంలోని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను చేపలు పట్టే వలలో చిక్కుకుని ఉన్నాడు. మృతుడు అలియాబాద్‌కు చెందిన కొంగ బాలనర్సింహా (66) గా గుర్తించారు. బుధవారం చేపల వేటకు వచ్చిన అతను ఇంటికి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.