వినాయక్ నగర్, సెప్టెంబర్ 23 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి యజమానులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపు బీరువాలో ఉన్న బంగారు నగలు దోచుకు వెళ్లారు. నాగారం ప్రాంతంలోని బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉండే పవన్ శర్మ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి పూజలు చేసేందుకు బయటకు వెళ్లాడు. రాత్రి ఆయన తిరిగి వచ్చే లోపు ఇంటి తాళం ధ్వంసం చేసి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో అనుమానం కలిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి ఉండడంతో అందులో ఉన్న 30 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లుగా బాధితుడు పోలీసులతో తెలిపాడు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన సీఐ ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీం ను రప్పించారు. చోరీ విషయం తెలియడంతో నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఘటనా స్థలానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఐదవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఐదు రోజుల వ్యవధిలో రెండు భారీ చోరీలు..
నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఐదు రోజుల వ్యవధిలో రెండు భారీ చోరీలు జరగడం పోలీసులకు సవాలుగా మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈనెల 18వ తేదీన సహా పహాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో సైతం దుండగులు కిటికి గ్రిల్ తొలగించి ఇంట్లోని పది తులాల బంగారు నగలతో పాటు సుమారు పది లక్షల వరకు కరెన్సీ నోట్లు ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం జరిగిన చోరీలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపినప్పటికి అందులో ఇంకా ఎలాంటి పురోగతి రాలేద సమాచారం.