హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగా ణ): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గురువారం కేసు విచారణ జ రుగుతుండగా లేఖ విషయం బయటపడింది. తాను 1610 రోజులుగా జైలులో బెయిలు లే కుండా గడుపుతున్నానని, ఇంకా ఎంతకాలం ఉండాలో కూడా తెలియడం లేదని, తనకు విముక్తి కల్పించాలని ఆ లేఖలో శ్రీనివాస్ కో రాడు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతోనే ఈ లేఖను రాస్తున్నట్టు పేర్కొన్నాడు.
నిందితుడి తరఫు న్యాయవాది ఈ లేఖపై మాట్లాడుతూ లేఖను సుప్రీం సీజేఐకి పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు చెప్పినా కొత్తగా పిటిషన్ వేయడం వెనక వేరే కారణాలు ఉన్నాయని తెలిపారు. విచారణను వేగవంతం చేసి కేసుకు ముగింపు పలకాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.