Meenakshi Natarajan | హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరసరణ వ్యవహారం పొలిటికల్ థ్రిల్లర్ కథను మించి మలుపులు తిరుగుతున్నది. ఆమెను ఓ కేసులో ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్ తాజాగా సంచలన విషయాలను బయటపెట్టారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత పీఏ (వ్యక్తిగత సహాయకుడు) తన వద్దకు వచ్చి మీనాక్షికి సంబంధించిన కేసు వివరాలు అడిగారని ఆమె ఒక జాతీయ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. జూన్ 6న తాను నాంపల్లి కోర్టు ఆవరణలో ఉన్నప్పుడు వచ్చిన అతను తన వద్ద నుంచి వివరాలు కావాలని కోరినట్టు చెప్పారు.
‘నా కేసు వివరాలు మీకెందుకు?’ అని తాను ఎదురు ప్రశ్నించడంతో వెళ్లిపోయాడని పిటిషనర్ స్పష్టంచేశారు. ఆ కేసుకు సంబంధించిన వివాదంలో శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా ఆ పిటిషనర్ ఆజ్‌తక్ మీడియా చానల్‌తో మాట్లాడారు. తనను లైంగికంగా వేధింపులకు గురిచేసిన డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి కాపాడుతున్నరని ఆరోపించారు.
మహిళనైన తనకు మీనాక్షీనటరాజన్ కూడా న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలిసి తన ఆవేదనను చెప్పుకొందామని వెళ్తే పోలీసులు తనను అక్కడి నుంచి తరిమివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పీఏ పురుషోత్తంరెడ్డి తనను అక్కడి పరిసరాల్లో కూడా నిలబడనివ్వలేదని, దీనిపై ఆయన ఫొటో కూడా కోర్టుకు అందించానని ఆమె వివరించారు.