హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్అపరేశ్కుమార్సింగ్ (ఏకే సింగ్) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం ఏ రేవంత్రెడ్డి వేదికపై ఆశీనులయ్యారు. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు నిర్వహించారు.
త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన అనంతరం కేంద్ర న్యాయశాఖ జారీచేసిన నోటిఫికేషన్ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్ గోవర్దన్ రెడ్డి చదివి వినిపించారు. ఆ తర్వాత బదిలీ నోటిఫికేషన్ ప్రతిని గవర్నర్.. నూతన సీజేకు అందజేసి ప్రమాణం చేయించారు. దైవసాక్షిగా, రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తానని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, చట్టసభల సభ్యులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, జస్టిస్ ఏకే సింగ్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.