హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై న్యాయవిచారణ చేపట్టాలని బీసీ, ఓసీ ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్‌లోని విద్యుత్తు సౌధలో భారీ ధర్నా నిర్వహించారు. విద్యుత్తు సంస్థల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయకుండా కొన్ని ఏండ్లుగా కండీషన్ల పేరుతో పదోన్నతులు కల్పిస్తున్నారని, ఇది సరికాదని జేఏసీ చైర్మన్ కోడెపాక కుమారస్వామి ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల యాజమాన్యాలు 3,830 మందికి పదోన్నతులు కల్పించాయని, ఇది పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ చొరవ తీసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకుంటే సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ ధర్నాకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. అనంతరం నేతలంతా జేఎండీ శ్రీనివాస్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో కో చైర్మన్ ఆర్ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో కన్వీనర్ సీ భానుప్రకాశ్, రాజేందర్, సోమయాజులు, విజయ్‌కుమార్, యాదగిరి, మారం శ్రీనివాస్, బ్రహ్మేందర్రావు, సదానందం తదితరులు పాల్గొన్నారు.
రెగ్యులర్ వీసీని నియమించాలని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం విద్యార్థులు నిరసన చేపట్టారు. తమ 17 డిమాండ్లను నెరవేర్చాలంటూ క్యాంపస్‌లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ఆందోళన చేశారు. డిమాండ్లు నెరవేర్చేంత వరకు రోజూ ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. – బాసర