హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మైనార్టీల మీద విస్తృత దాడులు చేస్తున్నాయని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. సోమవారం హైదరాబాద్లో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. మెదక్లో ఆస్తుల విధ్వంసంతోపాటు బక్రీద్ సందర్భంగా ఆదిలాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జనగామలో గోరక్షణ పేరుతో దాడులు చేశారని ఆరోపించారు. నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కావడంతో దేశ వ్యాప్తంగా ఘర్షణలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచేందుకు వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయా పార్టీల నాయకులు ఎస్ వీరయ్య, డీజీ నరసింహారావు, నర్సింహ, రమా, రామచందర్, గోవర్ధన్, శ్రీనివాస్, పాపయ్య, సుధాకర్, రవితేజ, జానకిరాములు పాల్గొన్నారు.