హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైస్ మిల్లర్స్, సర్కారు మధ్య పంచాయితీ తెగడం లేదు. సమస్యల పరిష్కారానికి మిల్లర్లు పట్టుపడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ మిల్లర్ల సమస్యల పరిష్కారంపై రేవంత్‌రెడ్డి సర్కారు ఫోకస్ చేయడం లేదు. దీనిపై మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ధాన్యం కొనుగోళ్లలో పాలుపంచుకోబోమని, ధాన్యాన్ని దించుకోబోమని తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య రైతులు నలిగిపోతున్నారు. కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోతున్నది.
ఆ 2 డిమాండ్లపై గట్టిగా పట్టు
ప్రభుత్వం ముందు మిల్లర్లు అనేక డిమాండ్లను పెట్టినప్పటికీ ప్రధానంగా రెండు డిమాండ్ల పరిష్కారం కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. మిల్లింగ్ చార్జీని పెంచడంతోపాటు సన్న ధాన్యం అవుట్ టర్న్ రేషియోను ఖరారు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులకు జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నది. కానీ, ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. మిల్లర్లు సన్న ధాన్యం తీసుకొని బియ్యం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం 100 కేజీల ధాన్యానికి 67 కేజీల బియ్యం (సీఎమ్మాఆర్) రావాలి. కానీ, సన్న ధాన్యంలో కేవలం 55-60 కేజీల బియ్యం మాత్రమే వస్తాయని మిల్లర్లు తెలిపారు. మిగిలిన నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే సన్న ధాన్యాన్ని దించుకోబోమని తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వమే సన్న ధాన్యం సీఎమ్మాఆర్పై టెస్ట్ మిల్లింగ్ చేయించాలని, ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా తాము సీఎమ్మాఆర్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ 67 కేజీల బియ్యం ఇవ్వాల్సి వస్తే క్వింటాలుకు రూ.300 చొప్పున ప్రోత్సాహం లేదా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితోపాటు మిల్లింగ్ చార్జీలు పెంచాలని కోరుతున్నారు. క్వింటాల్ రా రైస్ మిల్లింగ్‌కు మధ్యప్రదేశ్‌లో రూ.200, ఛత్తీస్‌గఢ్‌లో రూ.120, ఏపీలో రూ.110 చెల్లిస్తుంటే తెలంగాణలో రూ.10 మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ రెండు సమస్యలను పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
పరిష్కారం చూపని మంత్రుల కమిటీ
మిల్లర్ల సమస్యలతో పాటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై మొన్నటి వరకు పట్టింపు లేనట్టుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తీరా కొనుగోళ్లు ప్రారంభమయ్యే సమయానికి హడావిడి మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ నెల 8న నలుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. గోదాములను అద్దెకు తీసుకోవడం, రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ, మిల్లింగ్ చార్జీలు, ధాన్యం డ్రైయేజ్ సమస్యలకు పరిష్కారం చూపాలని ఈ కమిటీని ఆదేశించింది. వారం రోజుల క్రితం మిల్లర్లతో తొలిసారి భేటీ అయిన ఈ కమిటీ వారి సమస్యలపై చర్చ జరపకనే ఆ సమావేశం ముగించింది.
సర్కారు తీరుపై మిల్లర్ల గుస్సా
ప్రభుత్వ పెద్దలు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల తీరుపై మిల్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు తమపై కక్షగట్టిందని, మిల్లింగ్ పరిశ్రమను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమను దొంగలుగా చిత్రీకరిస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది చేసిన తప్పును మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల తీరుతో మిల్లులను మూసేసే పరిస్థితి ఏర్పడిందని, దీంతో తన మిల్లులోని మెషినరీని అమ్మేసి మరో వ్యాపారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నానని ఓ మిల్లర్ వాపోయారు.
అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సన్న ధాన్యానికి అవుట్‌టర్న్ రేషియోను ఖరారు చేసేవరకు ధాన్యాన్ని దించుకోబోమని మిల్లర్లు తెగేసి చెప్పడంతో సివిల్ సైప్లె అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో ఇంటర్మీడియట్ గోదాములను అద్దెకు తీసుకోవాలని, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆ గోదాముల్లో నిల్వ చేయాలని నిర్ణయించారు. ఎలా మిల్లింగ్ చేస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. అయినప్పటికీ అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మిల్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలానైనా అధికారులకు తమ బాధలు తెలుస్తాయని అంటున్నారు.
రైతుల ఇబ్బందులు
ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య కొనసాగుతున్న పంచాయితీలో రైతులు నలిగిపోతున్నారు. ఈ గొడవ ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నది. మిల్లర్లు ముందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అలస్యమవుతున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావాల్సి ఉండగా.. కేవలం నల్లగొండ, నిజామాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల, మిగిలిన జిల్లాల్లో మండలానికి ఒకటి మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిసింది.