కోనరావుపేట, సెప్టెంబర్ 22 : నాటు బాంబులను(Natu bomb) తయారు చేస్తున్న వ్యక్తితోపాటు జంతువులు, వణ్యప్రాణులను వేటాడుతున్న(Poachers) ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 24 గంటలు గడువక ముందే పోలీసులు కేసును ఛేదించి నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా(Siricilla district) కోనరావుపేట పోలీస్ స్టేషన్లో చందుర్తి సీఐ వేంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముడికె మల్లేశం అనే రైతుకు చెందిన బర్రె నాటు బాంబు కొరుకగా అది పేలడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో సదరు వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
అదే గ్రామానికి చెందిన పిట్టల రాజలింగం అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా నాటు బాంబులను తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. ఇటీవల సిరిసిల్ల రూరల్ మండలం చిన్న బోనాలకు చెందిన పడిగె లస్మయ్య, తుమ్మల కనుకరాజు, సర్దాపూర్‌కు చెందిన మొగిలి అంజయ్య అతని వద్ద నాటు బాంబులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వీరంతా వారివారి అటవీ ప్రాంతాల్లో నాటుబాంబులను గొర్రె పేగులకు చుట్టి జంతువులకు ఎరవేసి ఉంచుతున్నారు. దీంతో అటవీ జంతువులు వాటిని కొరికితే పేలడంతో అక్కడివక్కడే మృతి చెందగా, వాటి ద్వారా వచ్చే మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు.
ఇటీవల సర్దాపూర్‌కు చెందిన మొగిలి అంజయ్య పల్లిపిండిలో నాటుబాంబును ఉంచి ధర్మారం శివారులో ఎరవేసి ఉంచాడు. ఈ క్రమంలో అటుగా వెళ్లిన ముడికె మల్లేశం బర్రె బాంబును కొరికి మృతిచెందింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా రాజలింగం వద్ద 7 నాటుబాంబులు, తయారు చేసే గన్ పౌడర్, రూ.2 వేలు, పడిగె లస్మయ్య వద్ద 10 నాటు బాంబులు, తుమ్మల కనుకరాజు వద్ద 10 నాటుబాంబులు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై బీఎన్ఎస్, ఎక్స్‌ప్లోజివ్స్, వన్యప్రాణుల చట్టం ప్రకారం కేసు నమోదు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, సిరిసిల్ల పోలీసులు సర్దాపూర్‌కు చెందిన మొగిలి అంజయ్యను పట్టుకుని 40 నాటు బాంబులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.