ధరూరు/అయిజ, జూలై 17 : జూరాలకు వరద మొదలైంది. బుధవారం కర్ణాటకలోని నారాయణ్‌పూర్ డ్యాం 12 గేట్లను తెరిచి దిగువకు 37,260 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను ప్రస్తుతం 3.956 టీఎంసీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 71,682 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 293 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠ నీటినిల్వ 105.788 టీఎంసీలకుగాను ప్రస్తుతం 41 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
మహదేవపూర్/కాళేశ్వరం/కన్నాయిగూడెం/చర్ల: జూలై 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ద్వారా బుధవారం 49,500 క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. సమ్మక్క బరాజ్ వద్ద పెరుగుతున్న గోదావరి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌కు బుధవారం ఎగువ నుంచి 86,630 క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటిమట్టం 74.50 మీటర్ల ఎత్తుకు చేరుకున్నది. తాలిపేరు ప్రాజెక్టుకు.. ఎగువన నుంచి భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. మొత్తం 25 గేట్లు ఎత్తి 70.75 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.