ఆదిబట్ల, డిసెంబర్ 9: ‘నా చావుతోనైనా సమస్య పరిష్కరిస్తరా’ అని ఓ మహిళా రైతు కన్నీటి పర్వమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన తోపుగొండ రాములమ్మ భర్త గతంలో చనిపోయాడు. ఆమెకు గ్రామంలో సర్వే నంబర్ 185 లో మూడెకరాల అసైన్డ్ భూమి ఉంది. కలెక్టర్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు.
చేవెళ్ల రెవెన్యూ అధికారులకు ఆ భూమిని ఆన్లైన్ చేయాలని దరఖాస్తు చేసుకోగా.. ఈ ఫైల్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నదని చెప్పడంతో ఏడాదిగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నది. అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి తన గోడును అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్కు వెల్లడించింది. సమస్యను పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొంది.