రామన్నపేట, ఆగస్టు 23 : డబ్బులను డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన రైతు గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన పొలిమెర గోపాల్ (72)కు గ్రామంలో మూడెకరాల 35 గుంటల భూమి ఉన్నది. ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇటీవల లక్షా 35 వేలు మాఫీ అయ్యాయి.
ఆయన బ్యాంకు ఖాతాలో 80 వేలు ఉండగా.. పెద్ద కుమారుడి ఖాతాకు బదిలీ చేయించేందుకు కుమారుడితో కలిసి మునిపంపులలోని యూనియన్ బ్యాంక్‌కు వచ్చాడు. డబ్బును బదిలీ చేయించేందుకు పక్కనే ఉన్న పరిచయస్తుడితో ఓచర్ రాయాలని చెప్పి కుర్చీ మీద కూర్చున్నాడు. అంతలోనే నొప్పిగా ఉన్నదని మాట్లాడుతూనే కింద పడిపోయాడు. పక్కనే ఉన్న యువకుడు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.