Rangareddy | బడంగ్పేట్, మార్చి 16 : సాగు నీళ్లు లేక రైతు కన్నీరు పెడుతున్నాడు. వేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నాడు. పొట్టకు వచ్చిన వరి పంటకు నీళ్లు లేక పశువులకు వదిలేశాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అకాన్పల్లి గ్రామానికి చెందిన చిన్న నరసింహ నాలుగు ఎకరాల్లో వరి పంట వేశాడు. పదేండ్ల క్రితమే నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాడు. పంటకు తోడుగా ఆరు బర్లను లోన్ ద్వారా తీసుకున్నాడు.
వరి పంట తోపాటు బర్లకు కొంత మేత వేసుకున్నాడు. గతంలో మూడు బోర్లు ఉండగా కౌలుకు తీసుకున్న తర్వాత నరసింహ రెండు బోర్లు వేశాడు. ఐదు బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే తెచ్చిన అప్పులు తీరలేదు. పంట ఎండిపోవడంతో పశువులకు వదిలేశాడు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు వచ్చిందని రైతు చెప్తున్నాడు. మహేశ్వరం మండ లంలో చాలాచోట్ల రైతులు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నట్టు తెలిపాడు.
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వే సిన ఐదు బోర్లు ఎండిపోయా యి. బర్లకు గడ్డి కూడా దొరుకుతలేదు. తెచ్చిన అప్పులు తీరలేదు. పిల్ల లు కూలి పనులకు పోతున్నరు. మా ఆ ర్థిక పరిస్థితి బాగాలేదు. మా గోడు ఎవ రు పట్టించుకుంటలేరు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– చిన్న నరసింహ, రైతు, అకాన్పల్లి
నాకు 2.20 ఎకరాల భూమి ఉన్నది. అందులోని ఎకరంన్నరలో జొన్న, మిగిలిన భూమిలో పశుగ్రాసాన్ని పెంచుతున్నా. నా దగ్గర 7 బర్రెలు ఉండేవి. నాలుగేండ్ల కిందట ఒక బోరు వేస్తే నీరు రాకపోవడంతో రూ.3.60 లక్షలతో బావిని తవ్వించగా కొంతవరకు నీళ్లు వచ్చాయి. వాటితో పశుగ్రాసాన్ని సాగు చేస్తూ బర్రెలను మేపుతున్నా. నీరు లేకపోవడంతో గతేడాది ఒకేసారి రెండు బోర్లు 620, 650 ఫీట్లు వేయించినా నీరు రాకపోవడంతో పశుగ్రాసం పెరగకపోవడంతో జనవరిలో 2 బర్రెలు, ఫిబ్రవరిలో మరో 2 బర్రెలను అమ్మేసిన. నాలుగు నెలల కిందట కేబీఎస్ బ్యాంకులో రూ.లక్ష, సొసైటీ బ్యాంకులో రూ.1.20 లక్షలు లోన్ తీసుకొని రెండు బర్రెలను కొన్నా. వాటికి పశుగ్రాసాన్ని పెంచేందుకు ఈనెల 15న ఐదో బోరు 600 ఫీట్ల వరకు వేయించినా నీరు రాలేదు. ఇప్పటివరకు ఐదు బోర్లకు రూ.మూడు లక్షలు కాగా.. బర్రెల నిర్వహణ ఇతర ఖర్చుల నిమిత్తం రూ.6 లక్షల వరకు అప్పులు అయ్యాయి. నీరు లేక జొన్న పంట ఎండిపోవడంతో దాన్ని బర్రెలకు మేపుతున్నా. ఆ పంట సాగుకు రూ. రూ.40 వేల వరకు ఖర్చు అయింది. రూ.6 లక్షల అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నా. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– పులుమామిడి పరమేశ్, సిద్ధులూరు, వికారాబాద్ మండలం
నాకు రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం వీరన్నపేటలో నాలుగు ఎకరాల భూమి ఉండగా అందులో వరి సాగు చేసిన. వానకాలంలో నీళ్లు బాగా ఉండటంతో యాసంగిలోనూ మంచిగా పంట పడుతుందని భావించి మొత్తం వరి వేసిన. మార్చిలోనే ఎండలు ముదరడంతో బోరుబావుల్లోని నీరు ఇంకిపోయింది. పంటను కాపాడుకునేందుకు రూ.4 లక్షలకుపైగా అప్పు చేసిన. తొమ్మిది బోర్లను డ్రిల్ చేయించినా చుక్క నీరు రాలేదు. మండుతున్న ఎండలకు మూడు ఎకరాల్లోని పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరం వరిని కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నా. పంట బాగా పండితే చేసిన అప్పులు తీరుతాయని భావించిన. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే ఉన్న అప్పులతోపాటు ఇటీవల చేసిన రూ.4 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలుస్తలేదు. నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కావలి జంగయ్య, వీరన్నపేట, మం: చౌదరిగూడ