రామాయంపేట, ఆగస్టు 27 : అప్పుల బాధలు భరించలేక.. వాటిని తీర్చే మా ర్గం కనిపించక ఓ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో చో టుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్ము ల ప్రవీణ్ (33) సోమవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. ప్రవీణ్ కొంతకాలంగా అప్పులతో బాధపడుతున్నాడని, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి జ్యోతి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తగూడెం క్రైం, ఆగస్టు 27 : ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకా రం.. కొత్తగూడెంలోని హనుమాన్ బస్తీకి చెందిన కొప్పుల ఇమ్మాన్యుయేల్ (54) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆటో కోసం అప్పు చేయడం, ఆ తరువా త ఉపాధి కరువై ఆటో నడవకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అలాగే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఇమ్మాన్యుయేల్ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం కూడా ఇంట్లో గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన ఇమ్మాన్యుయేల్ మంగళవారం ఇంట్లో ఉన్న డీజిల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిరిసిల్ల తెలంగాణ చౌక్, ఆగస్టు 27 : సిరిసిల్లలో మరో నేత కార్మికుడు బలవన్మరణానికి పా ల్పడ్డాడు. కొన్ని నెలలుగా ఉపాధిలేక బతుకు భారమై నేత (వైపని) కార్మికుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బీవై నగర్‌కు చెందిన జక్కని సతీశ్ (22) తల్లిదండ్రులు 20 ఏండ్ల కిందటే చనిపోయారు. దీంతో తన అక్క సువర్ణ వద్ద ఉంటున్నాడు. ఆమె భర్త సైతం పదేండ్ల కిందటే ఆత్మహత్య చేసుకోగా, బీడీలు చేస్తూ తమ్ముడు సతీశ్‌ను పెం చింది. సతీశ్ వైపని పనిచేస్తూ అక్కకు ఆర్థికంగా సహాయపడేవాడు. కొన్ని నెలలుగా ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఇల్లు గడవడం లేదు. ఈ క్రమంలో రూ.1.5 లక్షల వరకు అప్పు చేశాడు. ఉపాధి లేక, అప్పు తీర్చే మార్గం కానరాక తీవ్రమనస్తాపం చెందిన సతీశ్ మంగళవారం ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
నిజాంసాగర్, ఆగస్టు 27: పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు విద్యుత్తు షాక్ తగిలి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వెల్గనూర్‌లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మ్యాదరి సాయిరాములు (36) సోమవారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటర్ నడవకపోవడంతో కరెంట్ సరఫరా ఉందో లేదో పరిశీలిస్తుండగా షాక్ తగిలి మృతి చెందాడు. సాయిరాములు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లగా, విగతజీవిగా ఉన్నాడు. పోలీసులు వివరాలు సేకరించారు. భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.