నారాయణపేట, మే 4 : తన భూమి కోసం అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిషారం కాకపోవడంతో ఓ రైతు నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన నడిమింటి కనకప్పకు చెందిన 31 గుంటల భూమి తన అన్న పెద్ద కనకప్ప భార్య హనుమమ్మ కబ్జాలో ఉంది. ఈ విషయంపై రెండేండ్లుగా దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం, నారాయణపేట కలెక్టరేట్లో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన కనకప్ప సోమవారం ప్రజావాణికి వచ్చి పురుగులమందు తాగాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పురుగులమందు డబ్బాను లాకోవడంతో ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ సిబ్బంది రైతును జిల్లా దవాఖానకు తరలించారు.

తిరుమలాయపాలెం/ఎర్రుపాలెం/ఇల్లెందు, మే 4 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, తెలంగాణ రైతు సంఘం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలాల్లో రైతులు సోమవారం ఆందోళనలు చేపట్టారు. పిండిప్రోలు వద్ద ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు.

శాయంపేట, మే 4 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట వద్ద జాతీయ రహదారిపై మక్క రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. శాయంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రం నుంచి పది రోజులుగా కాంటాలైన పంటను లారీలురాక తరలించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బస్తాలను తరలించి, మక్కలకు కాంటా చేయాలని డిమాండ్ చేశారు.

చింతకాని/ అశ్వాపురం, మే 4 : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ కమల్రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకుడు పొన్నం పాల్గొన్నారు.