‘ఇంటిపన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ రోడ్ల మరమ్మతు మీద లేదా? మేము ఇంతవరకు కట్టిన ఇంటి పన్ను వాపస్ ఇవ్వండి. లేదా రోడ్డు వేయండి’ అంటూ ఓ కుటుంబం నిరసన తెలిపింది. రోడ్ల మరమ్మతులో కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నగరంలోని అలకాపురికి చెందిన దుంపెటి రాము కుటుంబం ఇలా బురద రోడ్డుపై బైఠాయించింది.
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 17: రోడ్ల మరమ్మతు విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ కుటుంబం బురద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. నగరంలోని 9వ డివిజన్లో అలకపురికి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. వాహనాలు కాదు కదా.. నడిచే పరిస్థితి లేకపోయింది. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ కాలనీకి చెందిన దుంపెటి రాము వారి పిల్లలతోపాటు కాలనీ వాసులతో కలిసి నిరసన తెలిపారు.
‘ఇంటిపన్ను వసూలులో ఉన్న శ్రద్ధ 9వ డివిజన్ రోడ్ల మీద లేదా? మేము ఇంతవరకు కట్టిన ఇంటిపన్ను వాపస్ ఇవ్వండి. లేదా రోడ్డు వేయండి ఎంసీకే కమిషనర్ గారు’ అంటూ పోస్టర్ను ప్రదర్శించి నిరసన చేపట్టారు. అలాగే గుంతల రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. డివిజన్లోని ఆటోనగర్, అలకపురి, కోతిరాంపూర్, అయోధ్యపురి కాలనీల్లో రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు.