రాజన్న సిరిసిల్ల : వనం వీడి ఓ జింక(Deer) జనారణ్యంలోకి ప్రవేశించింది. వీధి కుక్కలు తరిమేయడంతో ఓ జింక ప్రాణ భయంతో ఓ ఇంట్లో దూరింది. వివరాల్లోకి వెళ్తే.. గంభీరావుపేట(Gambhiraopet) మండల కేంద్రంలోని దోసలగూడెం కాలనీ రాగుల కిషన్ ఇంట్లోకి సోమవారం ఉదయం అనూహ్యంగా జింక పరిగెత్తుతూ వచ్చి చేరింది. వీధి కుక్కలు వెంబడిస్తుండగా కాలనీ వాసులు అందరూ చూస్తుండగానే ప్రాణ రక్షణ కోసం వారి ఇంట్లోకి వచ్చి చేరింది.
అప్పటికే జింక నోటి నుంచి రక్తస్రావం కావడంతో పాటు వెన్నుపై గాయాలు ఉన్నాయి. వారి ఇంట్లో నుంచి జింక బయటకు పారిపోకుండా గేటు, తలుపులు మూసి యజమానులు కాపలా కాశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ రామ్మోహన్ అక్కడికి చేరుకొని ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. ఇంట్లో బంధించిన జింకను ఎస్ఐ రామ్మోహన్ సమక్షంలో స్థానికులు ఫారెస్ట్ సెక్షన్ అధికారి మంజులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన జింకకు చికిత్స చేసిన అనంతరం కరీంనగర్ డీర్ పార్కు తరలిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.