Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రే పేర్కొనడం రాక్షసానందానికి ప్రతీక. రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని కాంక్షించే ఏ ప్రభుత్వమూ ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం బాగున్నదనే చెప్పాలి. లేదంటే రాష్ట్ర పరపతి దెబ్బతింటుంది, పెట్టుబడిదారులకు నమ్మ కం పోతుంది’ – నిరుడు మే నెలలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు అవే నిజమయ్యాయి.
స్వయంగా ప్రభుత్వమే అంగీకరించింది. అది కూడా ఎక్కడో కాదు.. గురువారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా ఎమ్మెల్యేలకు వివరించారు. ‘ఖజానాలో నిధులు లేవు.. మీకు పనులు మంజూరు చేయలేం’ అని తేల్చి చెప్పినట్టు సమచారం. పైగా.. మంత్రులు చెప్తే నమ్మరనే ఉద్దేశంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ‘పనులు చేయలేం.. పైసలు ఇవ్వలేం’ అని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ప్రారంభించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రాష్ట్రం దివాలా తీసిందన్న ప్రచారం చేయాలని ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే శ్వేతపత్రం విడుదల చేసింది. తాము అధికారం చేపట్టాక చేసిన అప్పులను, తెలంగాణ ఏర్పడకముందే ఉన్న అప్పులను కూడా కేసీఆర్ సర్కారు ఖాతాలో వేసింది. ఈ దివాలాకోరు ఎత్తుగడతో పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు రాష్ట్రంవైపు చూడటం మానేశారు. కొత్త పెట్టుబడుల రాక దాదాపు నిలిచిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా దాదాపు రూ. 14వేల కోట్ల ఆదాయం పెరుగుతూ రాగా.. కాం గ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఆదాయం పెరుగకపోగా.. వచ్చే దాంట్లోనే దాదాపు రూ. 16వేల కోట్ల వరకు ఆదాయం తగ్గిపోయినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ఎత్తుకున్న దివాలా ప్రచారం చివరికి నిజంగానే రాష్ర్టాన్ని దివాలాతీసే దిశగా పాలన సాగుతున్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మనం బాగున్నామని చెప్తేనే ఎవరైనా మనల్ని నమ్ముతారు.. అలా కాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని చెప్తే ఎవరూ నమ్మరు. కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరువు తీస్తున్నదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యింది’ అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేకమార్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రచారం చేశారు. ‘లంకెబిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి, రాష్ర్టాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచారు, ప్రతి నెల వచ్చే ఆదాయం సరిపోవడం లేదు.. మళ్లీ అప్పు చేయాల్సి వస్తున్నది’ అంటూ తరుచూ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందనే స్థాయిలో ప్రభుత్వం ప్రచారం చేసింది.
రాజకీయ కక్షతో చేసిన ఈ ప్రచారం రాష్ర్టానికే శాపంగా మారిందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిదారులకు రాష్ట్రంపై నమ్మకం పోయిందని, ఫలితంగా ఆదాయం పడిపోయిందని చెప్తున్నారు. పైగా 14 నెలల కాలంలోనే వివిధ మార్గాల ద్వారా ఏకంగా రూ.1.46 లక్షల కోట్ల అప్పులు చేశారని, వీటితో సంపదను సృష్టించడంలోనూ ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శిస్తున్నారు. అటు గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నామని, ఇటు చెప్పుకోవడానికి కొత్తగా ప్రాజెక్టులేమీ చేపట్టలేదని వాపోతున్నారు. ‘తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ర్టాన్ని ధనిక రాష్ట్రం అని పదేపదే ప్రచారం చేశాం. దీంతో అందరిలో నమ్మకం పెరిగింది. పదేండ్ల పాలనలో దానిని నిజం చేసి చూపించాం’ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిపుణులు ఉదాహరిస్తున్నారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా పేర్కొనడంతో పెట్టుబడిదారులు, బడా వ్యాపారవేత్తలు తెలంగాణపై ఆసక్తి చూపారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి భిన్నంగా రాష్ట్రం దివాళా తీసిందని చెప్తుండటం శాపంగా మారిందని అంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం ఏటికేడు పెరిగింది. 2015 నుంచి లెక్కిస్తే.. 2023 నాటికి సగటున ప్రతి సంవత్సరం రూ.14వేల కోట్ల ఆదాయం పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఒక్క కరోనా కాలంలో మాత్రమే రూ.2వేల కోట్లు లోటు నమోదైంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం పెరగకపోగా, తగ్గిపోయిందని గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వం స్వయంగా కాగ్‌కు సమర్పించిన నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2023-24తో పోల్చితే 2024-25 డిసెంబర్ నాటికి రెవెన్యూ వసూళ్లు రూ.12వేల కోట్లు తక్కువగా నమోదైనట్టు కాగ్ నివేదిక స్పష్టంచేసింది. అంటే ప్రతి త్రైమాసికానికి సగటున రూ.4వేల కోట్ల చొప్పున నష్టపోయిందన్నమాట.
ఈ లెక్కన చివరి త్రైమాసికం కూడా గణిస్తే రూ.16 వేల కోట్ల వరకు లోటు తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే.. ఏటా పెరగాల్సిన రూ.14వేల కోట్లు రాకపోగా, రావాల్సిన ఆదాయంలోనే రూ.16వేల కోట్లు రాష్ట్రం నష్టపోయిందని చెప్తున్నారు. దీనిని బట్టి ఏడాది కాలంలోనే ఏకంగా రూ.30 వేల కోట్లు నష్టపోయామని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ‘రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దు. రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి ఒక బీమారీ రాష్ట్రంగా చూపించొద్దు. ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్ వెళ్తే తీరని నష్టం చేస్తుంది’ అని 2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. కేసీఆర్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు నిజమని గణాంకాలతో వెల్లడైందని అంటున్నారు.
కేసీఆర్‌పై కక్షతో చేసిన తప్పుడు ప్రచారానికి తోడు.. రాజకీయంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఆర్థికరంగంపై పిడుగుపాటుగా మారిందని కాంగ్రెస్ సీనియర్లు వాపోతున్నారట. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ విషయంలో హెచ్చులకు పోయి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు భస్మాసుర హస్తంగా పరిణమించాయని సీనియర్లు చర్చించుకుంటున్నారట. రుణమాఫీ చేసే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ అధికారులు మొత్తుకుంటున్నా, దానికి బదులు రైతు భరోసా ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచించినా చెవిన పెట్టలేదని వాపోతున్నారట. హరీశ్‌రావు చేసిన సవాల్‌పై తాను నెగ్గానని గప్పాలు కొట్టుకోవడం కోసం ప్రభుత్వ ఆదాయం, అప్పోసొప్పో చేసిన డబ్బు.. ఇలా మొత్తం నిధులను రుణమాఫీకి కేటాయించారని చెప్తున్నారు. అయినా సరిపోక అరకొరగానే రుణమాఫీ అయ్యిందని అంటున్నారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందోనని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. రెండుమూడు నెలల తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అని ఉద్యోగ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నదని సమాచారం.
ప్రభుత్వంలోని పెద్దలకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, పాలనపై లేదనే విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. మంత్రుల్లో అత్యధిక శాతం మంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పట్టింపు లేనట్టుగా ఉంటున్నారని సమాచారం. పాలకులే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ‘దివాళా’ పాట మానకపోతే మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.