అశ్వారావుపేట, జనవరి 20: పశువుల మందపై పెద్దపులి దాడి చేయడంతో ఆవు, దూడ మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్లలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. కావడిగుండ్లకు చెందిన సోడెం నాగేశ్వరరావు మేతకు తీసుకెళ్లిన పశువులను సోమవారం రాత్రి జామాయిల్ తోటలో కట్టేశాడు. మంగళవారం ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లేందుకు తోట వద్దకు రాగా.. అందులో ఒక ఆవు చనిపోయి ఉన్నది.
దాని మెడ చుట్టూ కొరికిన గాయాలు ఉన్నాయి. మరో గిత్త కూడా సుమారు 100 మీటర్ల దూరంలోని వాగు వద్ద ముక్కలుగా పడి ఉన్నది. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు చనిపోయిన ఆవు, దూడను పరిశీలించారు. పులి పాదముద్రలను గుర్తించారు. ఏపీలోని వేలేరుపాడు మండలం పాపికొండల వద్ద నేషనల్ పార్క్ నుంచి తెలంగాణలోకి పులి వచ్చి ఉంటుందని రేంజర్ మురళి అనుమానం వ్యక్తంచేశారు. సమీప గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.