మునగాల, ఏప్రిల్ 22: రోడ్డుపై నిలిచి ఉన్న కంటైనర్ కిందికి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో హెచ్‌పీ పెట్రోబంక్ ఎదుట సోమవారం చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్‌రాజ్ (29), భార్గవి (26) దంపతులు.
నవీన్‌రాజ్ కృష్ణాజిల్లా గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తుండగా భార్గవి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ విజయవాడలో నివాసముంటున్నారు. ఈ నెల 20 భార్గవి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు.. హైదరాబాద్‌లో ఉంటున్న నవీన్‌రాజ్ తల్లిదండ్రుల దగ్గరికి కారులో వచ్చారు. శనివారం పుట్టినరోజు వేడుకను బంధువుల మధ్య ఆనందంగా జరుపుకొన్నారు.
సోమవారం ఉదయం కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. మార్గమధ్యంలో ముకుందాపురం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కంటైనర్ కిందికి దూసుకెళ్లింది. దాంతో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు జేసీబీలు, క్రేన్, ట్రాక్టర్ సాయంతో కంటైనర్ కింద ఇరుక్కున్న కారును బయటికి తీశారు. కారులో ఉన్న నవీన్‌రాజ్, భార్గవి మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద ఘటన పెట్రోల్‌బంక్ సీసీ కెమెరాలో నమోదైంది. బంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. సీఐ రామకృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.