హైదరాబాద్ : సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఇవాళ్టి ఇరిగేషన్ మీటింగ్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తెలంగాణకు మరణశాసనం రాయబోతున్నదని చెప్పారు. తెలంగాణభవన్‌లో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన హరీష్‌రావు.. ఢిల్లీలో జలవివాదంపై జరుగుతున్న మీటింగ్‌లో రాష్ట్రానికి ద్రోహం జరగనుందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘పోలవరం నల్లమలసాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి
ప్రకారం ఏపీకి సహకరిస్తున్నది. ఆ కుట్రల తీరును ఒకసారి గమనించండి. పోను పోను అనుకుంటూనే
రేవంత్ రెడ్డి నాడు డిల్లీ మీటింగ్‌కు వెళ్ళాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు. పెట్టబోను అంటూనే సంతకంపెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాశాడు. వేయను అంటూనే కమిటీవేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్ళి నల్లమలసాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు. పసలేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమలసాగర్‌కు మద్దతు ప్రకటించాడు’ అని రేవంత్ కుట్రలను వెల్లడించాడు.
‘రేవంత్‌రెడ్డి ప్లాన్డ్గా సహకరిస్తూ చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నడు. ఏపీ ఒత్తిడితో ఇవాళ జరుగుతున్న ఢిల్లీ మీటింగ్‌లో ఇంజినీర్లు పాల్గొంటున్నారు. ఇది పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీల నీటిని గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన కుట్ర. ఇలాగే గతంలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా
ముందుపెట్టింది. ఇప్పుడు కూడా ఏపీ పాలకులు నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నరు’ అని హరీష్‌రావు విమర్శించారు.