హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రస్తుతం అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనమండలిలో వెల్లడించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకం కింద తొలి దశలో 1.54 కోట్లు, రెండో దశలో 1.63 కోట్ల మంది లబ్ధి పొందారని వివరించారు. శనివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. కంటి వెలుగు పథకం గురించి పైవిధంగా స్పందించారు. కంటి వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘ఐ కేర్ క్లినిక్స్’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సరోజినీదేవి కంటి దవాఖాన ‘హబ్’గా వ్యవహరిస్తుందని వెల్లడించారు.
నిపుణుడిని నోడల్ ఆఫీసర్గా నియమిస్తామని తెలిపారు. మంత్రి సమాధానంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందినట్టు తేటతెల్లమైంది. ఆర్ఎంపీలు, పీఎంపీల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హామీ ఇచ్చారు. గతంలో వారికి శిక్షణ ఇవ్వడంపై ఐఎంఏ తరఫున తెలంగాణ వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. ఈ అంశం కోర్టులో పెండింగ్లో ఉన్నట్టు వివరించారు. మలక్పేట ఐటీ టవర్ నిర్మాణ జాప్యంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. 02-10-2023 తేదీన శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు. తాజాగా టెండర్ ఆహ్వానించే ప్రక్రియ పరిశీలనలో ఉన్నదని తెలిపారు.