మక్తల్, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో(Muncipal elections) దోస్తుల మధ్య జరిగిన కరచాలనం చిలికి చిలికి గాలి వానగా మారి గొడవకు దారితీసింది. ఒకరిపై ఒకరు చెయ్యి చేసు కున్న సంఘటన బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్(Makthal )మున్సిపాలిటీలోని ఒకటవ వార్డులో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం మంగళవారం ముగియగా.. బుధవారం ఉదయం అభ్యర్థులు తమ గుర్తులతో వాటిలో ప్రచారం ప్రారంభించారు.
ఇదే ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డ్ అభ్యర్థి కట్ట సురేష్ కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్న తరుణంలో బీజేపీ అభ్యర్థి బాయికాటి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ కార్యకర్తలు వార్డులో ప్రచారం ప్రారంభించారు. నిజ జీవితంలో ఇదే వార్డుకు చెందిన కురువ మహదేవ్, జగదీష్ లు మిత్రులు కావడంతో జగదీష్, కురువ మహదేవులు ఒకరినొకరు కరచాలని చేసుకొని, పార్టీల స్థితిగతులపై చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల మధ్య గొడవ చెలరేగింది. బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త చేతులు లాగుతావా అంటూ కాంగ్రెస్ కార్యకర్త జగదీష్ పై దాడికి దిగాల్సిన పరిస్థితిలో నెలకొనడంతో ఒక్కసారిగా గొడవ చిలికి చిలికి గాలివానగా తయారు కావడంతో స్థానిక నాయకులు కలుగుజేసుకొని గొడవను విరమింపజేశారు.
కాగా, ఎన్నికల సమయంలో స్నేహితుల మధ్య చిచ్చులు పెట్టే నాయకులు ఉన్నారని ప్రజలు వాపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వివాదం చివరికి దేనికి దారితీస్తుందోనని వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా తయారవ్వడం ఇదేనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.