ఖైరతాబాద్, మే 17 : ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట డీఐ క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గుగ్గిళ్లగూడకు చెందిన కిరణ్ మీర్‌పేటలో ఎస్వీ ట్రేడర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. నిరుడు జనవరిలో ఎల్బీనగర్ టికెట్ కోసం కేఏ పాల్‌ను కలువగా రూ.50లక్షలు ఇస్తే టికెట్ ఇస్తానని చెప్పాడు. దీంతో వ్యాపారి రూ.30లక్షలు ఆన్లైన్లో చెల్లించాడు.
అనంతరం విడతలవారీగా రూ.20 లక్షలు ముట్టజెప్పాడు. గత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తానంటూ తిప్పించుకొని చివరికి పాల్ చేయిచ్చాడు. బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, దాటవేస్తూ వచ్చాడు. దీంతో కిరణ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పాల్‌పై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.