రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనేది మరోసారి తెరమీదికొచ్చిందా? ప్రతిపక్ష నేత జోస్యం చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తథ్యమా? ‘ఆయన ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు’ అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారా? ఇటీవల డిన్నర్ పార్టీకి రాహుల్ గాంధీ అయనను పిలిచేందుకు అస్సలు ఇష్టపడలేదా? ఈసారి మార్పు తప్పదనే సంకేతాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అందుతున్నాయా? అవకాశం వస్తే అధిష్ఠానం ముందు సత్తా చాటాలని ఆ.. నంబర్ నేత అతార, పతారలు సిద్ధం చేసుకుంటున్నారా? కాలం కలిసి వస్తే సీఎం సీటుపై పాలు పొంగించాలని ఉబలాటపడుతున్నారా? అంటే కాంగ్రెస్ వర్గాలు ‘అవును’ అనే అంటున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఓవైపు బీజేపీ నేతలు డిసెంబర్ లోపు ముఖ్యమంత్రిని మార్చుతారని బహిరంగంగానే ప్రకటిచడం, మరోవైపు మార్పు అనివార్యం అనే సంకేతాలు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తుండటంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, వచ్చే అవకాశాన్ని అందిపుచ్చకునేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు కొందరు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో అగ్రకుల సామాజిక వర్గానికే చెందిన ఓ నేత సీనియర్లను సైతం తోసేసుకొని ముందుకు నడుస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా అటు పరిపాలన పరంగా గాని, ఇటు పార్టీ పరంగా గాని ఉత్సాహపూరిత వాతావరణం కనిపించడం లేదని ఏఐసీసీకి టీపీసీసీ నివేదించినట్టు తెలిసింది. హైడ్రా కూల్చివేతలతో మొదలైన కాంగ్రెస్ సర్కారు డ్యామేజీ.. బనకచర్లకు అనుకూల నిర్ణయంతో పాతాళానికి చేరిందని టీపీసీసీ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు ఆయన రెండు పడవల మీద కాలేసి ముందుకుపోతున్నాడని, ఎప్పుడు పుట్టి ముంచి జంప్ అవుతాడోనని ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాలు హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పొరుగు రాష్ట్ర సీఎం ప్రభావం తెలంగాణ సీఎం మీద ఎక్కువగా ఉన్నదని, ఆయన డైరెక్షన్లోనే మోదీని అనుసరిస్తున్నారని, ఇంకా ఆయనను నమ్ముకుంటే ఏ క్షణంలోనైనా వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉన్నదని నిఘా వర్గాలు చెప్పినట్టు తెలిసింది. జాగ్రత్త పడకపోతే ఇబ్బందుల్లో పడుతామని, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దూత పంపిస్తున్న నివేదికలు అదే అంశాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇటీవల రాహుల్ గాంధీ ఇండియా కూటమికి ఇచ్చిన విందుకు పిచిలిన చిట్టచివరి గెస్టు తెలంగాణ రాష్ర్టానికి చెందిన ముఖ్యనేతనే అని కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. ఈ నెల 3న రాహుల్‌గాంధీ విందు కార్యక్రమం ఫిక్స్ కాగా 4న సాయంత్రం వరకు ఇండియా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులకు, కూటమిలోని పార్టీ కీలక నేతలకు ఆహ్వానాలు అందాయి. 5న సాయంత్రానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు, ఏఐసీసీ నేతలకు, కాంగ్రెస్‌కు చెందిన ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్టు తెలిసింది. ఆయా తేదీల్లో తెలంగాణకు చెందిన నాయకుడు ఢిల్లీలో ఉన్నా రాహుల్‌గాంధీ మాత్రం విందుకు పిలవనట్టు తెలిసింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్యవర్తిత్వం చేసి ఆయనను కూడా విందుకు పిలవాలని అభ్యర్థించినట్టు సమాచారం. ఆయన అభ్యర్థనపై తీవ్రంగా స్పందించిన రాహుల్‌గాంధీ ‘తెలంగాణలో ఏం జరుగుతున్నదో మీరు గమనిస్తున్నారా?’ అని సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఊహించని ప్రశ్నతో కంగుతిన్న ఏఐసీసీ కార్యదర్శి రాహుల్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ‘తను ఎంతకాలం ఉన్నా మనవాడని ఓన్ చేసుకోలేం’ అని చెప్తూ అయిష్టంగానే ‘సరే పిలవండి’ అని చెప్పినట్టు తెలిసింది.
ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలన్నీ మార్పు అనివార్యమేనని చెప్తున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు అప్రమత్తమైనట్టు సమాచారం. సీఎం పదవి దకించుకునేందుకు ఇప్పటినుంచే లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇటీవల ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఏఐసీసీ నేతకు టచ్‌లోకి వెళ్లగా పార్టీకి అతీతంగా, మీకు వ్యక్తిగతంగా ఎంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని అడిగినట్టు హస్తం పార్టీలో చర్చ నడుస్తున్నది. సీఎం సీటు మీద కన్నేసిన నేతలు తమకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. పార్టీతో సంబంధం లేకుండా ఇప్పుడున్న ముఖ్యనేతకు కేవలం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నదని, వీరిలో ఒక మంత్రి కూడా ఉంటారని పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు. సీఎం సీటు కోసం గతంలో పట్టుబట్టిన ఇద్దరు సీనియర్ నేతల్లో ఒకరు 20 పర్సెంట్ కమీషన్‌తో సెల్ఫ్ అవుట్ అయ్యారని, మరో సీనియర్ మంత్రికి కేవలం 4 నుంచి 5 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్టు గాంధీ భవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికతో మరో సీటు పెరిగింది. వీరిలో మూడింట ఒకటిన్నర వంతుల మంది ఎమ్మెల్యేలు ఆ..నంబర్ మంత్రి వైపు మొగ్గు చూపుతున్నారని, వీరిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దక్షిణ తెలంగాణలోని మూడు జిల్లాల ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి ఆయనకు 21 నుంచి 25 మంది మద్దతుదారు ఎమ్మెల్యేలతో పాటు ఆర్థిక బలం తోడున్న సదరు నంబర్ మంత్రి కూడా సీఎం సీటుపై గురిపెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అయితే ఆయనకు అధిష్ఠానం వద్ద చెప్పుకోదగిన బలం లేకపోవడంతో పొరుగు రాష్ర్టానికి చెందిన మహిళా నేత ద్వారా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తనకు సీఎం పదవిని అప్పగిస్తే ఢిల్లీకి కావాల్సింది ఇవ్వడానికి సిద్ధమేనన్న ప్రతిపాదన పంపినట్టు గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.