వరంగల్ : వరంగల్(Warangal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రాయపర్తి మండల శివారు కిష్టాపురం క్రాస్ రోడ్డులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని(Lorry) బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి సిమెంట్ లోడుతో వరంగల్ వైపునకు వస్తున్న లారీని డ్రైవర్ కిష్టాపురం క్రాస్ రోడ్డులో రోడ్డుపై నిలిపి ఉంచి టైర్లు పరిశీలిస్తున్నాడు.
ఈ క్రమంలో వెనక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం లారీని ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు సంగెం మండలం ఎలుగూరు రంగంపేట శివారు బికోజి నాయక్ తండాకు చెందిన బోడ తులసీరామ్ కాగా మరొక యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.