హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ‘అభయ హస్తం’ దక్కిందా? కాంగ్రెస్ గెలుపు కోసం అన్నివిధాలా సహకరించిందా? కాంగ్రెస్ నేతల అరాచకాలను, ప్రలోభాలను పట్టించుకోలేదా? బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిందా? అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలక్షన్ కమిషన్ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ గెలుపునకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలొస్తున్నాయి. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉపఎన్నిక నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని, కండ్ల ఎదుటే అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షులను నియమిస్తుంది. ఈసారి కూడా నియమించింది. కానీ, వారు ఎక్కడున్నారో ఏం చేశారో ఎవరికీ తెలియదనే విమర్శలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించలేదని, జరుగుతున్న అక్రమాలపై మౌనం వహించారనే విమర్శలున్నాయి.
డబ్బు పంపిణీ.. దొంగ ఓట్లు.. పత్తాలేని ఈసీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూసిందనే విమర్శలున్నాయి. నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ చేయని పనిలేదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ నేతలు భారీ మొత్తంలో దొంగఓట్లు వేయించారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు, చీరలు పంపిణీచేసిన వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఒక్కో ఓటుకు రూ.ఐదువేల వరకు పంపిణీ చేసినట్టు ఓటర్లు చెప్పుకుంటున్నారు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగానే, పోలీంగ్ కేంద్రాలకు సమీపంలోనే ఓటర్లకు డబ్బులు, చీరలు పంచారు. దొంగ ఓట్లకు లెక్కేలేదు. ఇతర ప్రాంతాల వారి పేర్లపై దొంగఓట్లు నమోదుచేయించి వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. దొంగఓట్లు వేస్తున్న వారినే కాకుండా ఓ ఫంక్షన్హాల్లో మోహరించిన దొంగ ఓటర్లను సైతం బీఆర్ఎస్ నేతలు పట్టుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. దొంగఓట్లు, డబ్బులు, చీరల పంపిణీని అడ్డుకోకుండా ఎన్నికల సంఘం కాంగ్రెస్కు పరోక్షంగా సహకరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ 99 ఫిర్యాదులు.. ఒక్కదానిపైనా చర్యల్లేవు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చేసిన అరచకాలు, అక్రమాలపై బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం బుట్టదాఖలు చేసిందనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా 99 ఫిర్యాదులు చేసింది. ఇందులో ఎన్నికల పోలింగ్ రోజు ఒక్కరోజే 60 ఫిర్యాదులు చేసింది. ముఖ్యంగా దొంగఓట్లు, డబుల్ ఓట్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలు సహా ఎన్నికల సంఘానికి అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదుచేశారు. అయినా కేంద్ర ఎన్నికల సంఘం గానీ, రాష్ట్ర అధికారులు గానీ బీఆర్ఎస్ ఫిర్యాదులను ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. 99 ఫిర్యాదులు చేస్తే ఇందులో ఒక్కటంటే ఒక్క ఫిర్యాదుపై కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి లేకపోవడం ఎన్నికల సంఘం పక్షపాత వైఖరికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.