హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఫార్మసీ కోర్సులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. మెడికల్ కోర్సుల్లో సీట్లు రాని ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ కోర్సులవైపు మళ్లారు. దీంతో ఒక్కసారిగా సీట్లన్నీ నిండాయి. ఈ ఏడాది ఎంసెట్ (బైపీసీ) వెబ్ కౌన్సెలింగ్ మొదటి విడతలోనే 7,597 (97% పైగా) సీట్లు భర్తీ అయ్యా యి. వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో సీట్లన్నీ నిండిపోయాయి. ఒక్కటంటే ఒక్క సీటు మిగలని పరిస్థితి నెలకొన్నది. సోమవారం ఎంసెట్ (బైపీసీ) మొదటి విడత సీట్లను కేటాయించారు. రాష్ట్రంలో 119 కాలేజీలుంటే 80 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి.
ఫార్మా -డీ కోర్సులోని 65 కాలేజీల్లో 1,343 సీట్లుంటే, 1,342 సీట్లు నిండగా, ఒక్క సీటు మాత్రమే మిగిలింది. బయో మెడికల్ , ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కోర్సుల్లో సీట్లన్నీ భర్తీయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 598 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. మొత్తం 8,545 మంది విద్యార్థులు సీట్లను సొంతం చేసుకోలేకపోయారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14లోపు ఫీజు చెల్లించి, ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలి. తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 23 నుంచి 26 వరకు సీటు వచ్చిన కాలేజీలో టీసీ, ఇతర విద్యార్హత జీరాక్స్ ధ్రువీకరణ పత్రాలను ప్రత్యక్షంగా సమర్పించాలి.