Kaleshwaram | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు మరోసారి అక్కసు వెళ్లగక్కుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీటి పంపిణీ వ్యవస్థను వినియోగించుకుంటూనే, మరోవైపు ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి సాధించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సగటున గత సంవత్సరం కంటే 97 శాతానికిపైగా అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ ప్రాజెక్టులన్నీ నిండుగా ఉన్నాయి. పలుచోట్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చెరువులదీ అదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఒక్క లిఫ్ట్ కూడా రన్ చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది. వరుణుడి దయ, రైతాంగం శ్రమ వెరసి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిపంట సాగైంది. ధాన్యం దిగుబడి వచ్చింది. రైతాంగం శ్రమను, ప్రకృతి కరుణను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని చెప్తున్న ప్రభుత్వం.. ఆ మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసు వెల్లగక్కడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బరాజ్‌లు పనిచేయకున్నా, నీటిని ఎత్తిపోయకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని ప్రచారానికి దిగడమే అందుకు నిదర్శనమని చెప్తున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు లిఫ్ట్ చేయలేదని చెప్పడం శుద్ధ అబద్ధం. ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో మొదటగా ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నంది, గాయత్రి పంప్‌హౌజ్‌ల నుంచి దాదాపు పది టీఎంసీల నీటిని రాజరాజేశ్వర జలాశయానికి తరలించారు. రిజర్వాయర్ నీటిమట్టం 16 టీఎంసీలకు చేరుకున్న క్రమంలో వరదలు మొదలవడంతో అక్కడ ఎత్తిపోతలను నిలిపేశారు. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్‌కు, ఆపై మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 23 టీఎంసీలు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న పంప్‌హౌజ్‌ల నుంచి ఆయా రిజర్వాయర్లకు మొత్తంగా 33 టీఎంసీలను ఎత్తిపోశారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి మంత్రి కొండా సురేఖ సాగునీటి కాల్వలకు జలాలను విడుదల చేశారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలో చెరువులను కూడా నింపారు. అయినా ప్రాజెక్టును వినియోగించలేదని, నీటిని ఎత్తిపోయలేదంటూ చెప్పడంపై తెలంగాణ ఇంజినీర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఇంజినీర్లు సెటైర్లు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం, పనితీరుపై అవగాహన ఉండే ఆ వాఖ్యలు చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక్కచోట నుంచి మాత్రమే నీటిని తీసుకునేలా రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాజెక్టులను డిజైన్ చేశారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు పూర్తిగా భిన్నం. ప్రాజెక్టు రాడార్‌లోని రిజర్వాయర్లకు, తద్వారా ఆయకట్టుకు నేరుగా ఎస్సారెస్పీ నుంచి, ఒకవేళ అక్కడ ప్రవాహాలు లేకపోతే దిగువ ఎల్లంపల్లి నుంచి, అక్కడ కూడా ఆశించిన స్థాయిలో వరద లేకపోతే ఆ దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించుకునే వెసులుబాటు ఉన్నది. ప్రాజెక్టు విశిష్టత అదే. ఎక్కడ సమృద్ధిగా నీరు లభిస్తే అక్కడి నుంచే తీసుకోవడం దీని ప్రత్యేకత. ఈ ఏడాది ఎస్సారెస్పీకి, ఆ తరువాత ఎల్లంపల్లికి సమృద్ధిగా వరదవచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచే నీటిని తీసుకున్నారు. ఒకవేళ ఆ మూడు బరాజ్‌లు వినియోగంలో ఉన్నా కూడా ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నుంచే నీటిని తీసుకునేవారు. ఈ విషయాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం కూడా వానకాలం సాగుకు సంబంధించినది కాదు. యాసంగి సాగుకు పూర్తి భరోసా కల్పించేందుకు, చెరువులను నింపుకోవడమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు లక్ష్యం. వర్షాభావ పరిస్థితుల్లో వానకాలం పంటలకు సాగునీరు అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ పెద్దలకు దీనిపై అవగాహన లేదని, కేవలం ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు వాదిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్‌లనే కాదు, రాష్ట్రంలో ఈ ఏడాది వానకాలంలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీటిని ఎత్తిపోయకపోవడం గమనార్హం. ఈ ఏడాది కృష్ణా, గోదావరి బేసిన్లలో ఇప్పటికీ ప్రవాహాలు కొనసాగుతుండటమే ఇందుకు కారణం.