హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/ధర్మారం: కాళేశ్వరం కూలిందన్న వారి అసత్య ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ బాహుబలి మోటర్లు జలగర్జన చేశాయి. నీళ్లను ఎత్తిపోశాయి. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలను తరలించాయి. బుధవారం ఉదయం నంది, గాయత్రి పంపుహౌస్‌ల్లో మూడు మోటర్ల చొప్పున ఆన్ చేశారు. మొత్తంగా 9,450 క్యూసెక్కుల జలాలను మిడ్‌మానేరుకు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తంగా ఏడు లింకులు ఉన్న విషయం తెలిసిందే. అందులో మేడిగడ్డ ఘటనను, ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ లింక్-1లోని లక్ష్మి, సరస్వతి, పార్వతి బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టింది. ప్రాణహిత జలాలను మళ్లించే అవకాశం ఉన్నా రాజకీయాల కోసం కాళేశ్వరం కూలిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నది. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లింక్-2లోని పంపులను ఆన్ చేసి గోదావరి జలాల తరలింపును చేపట్టింది. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి జలాలను తరలించే నీటిసరఫరా వ్యవస్థ మొత్తాన్ని లింక్-2గా పిలుస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో భాగంగా ఎల్లంపల్లి నుంచి జలాలను తొలుత 1.1 కిలోమీటర్ గ్రావిటీ కాలువ తవ్వడంతోపాటు 9.590 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగమార్గాలను నందిమేడారం వరకు తవ్వించారు. ఎల్లంపల్లి నుంచి విడుదలచేసిన జలాలు.. వీటి ద్వారా వచ్చి నందిమేడారం సర్జ్పూల్కు చేరుకుంటాయి. ఇక్కడ నంది పంప్‌హౌస్‌లోని మోటర్ల ద్వారా జలాలను ఎత్తి నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఇక్కడినుంచి జలాలను సొరంగాల ద్వారా గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తారు. ఇక్కడినుంచి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాహుబలి మోటర్లతో నీటిని ఎత్తి వరద కాలువ ద్వారా మిడ్‌మానేరుకు తరలిస్తారు. మొత్తంగా దీనిని లింక్-2గా పిలుస్తారు. బుధవారం లింక్-2లోని పంప్‌హౌస్‌లో మూడు (2,4,5 నంబర్లు గల )మోటర్లను ఆన్ చేశారు.
ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 9,450 క్యూసెకుల నీరు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఉప్పొంగుతూ ఎగువన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌కు పరుగులు పెడుతున్నది. ఇక్కడ సైతం (1,2,4 నంబర్లు గల) మూడు బహుబలి మోటర్లను ఆన్ చేయగా, ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 9,450 క్యూసెకుల జలాలు సుమారు 5.7 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ ద్వారా ప్రయాణించి 99 కిలోమీటర్ వద్ద వరద కాలువలోకి చేరుకుంటున్నాయి. అక్కడినుంచి నేరుగా సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి తరలివెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తంగా 0.281 టీఎంసీల జలాలను మధ్యమానేరుకు తరలించి, సాయంత్రం మోటర్లను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు.
వానకాలంతోపాటు వచ్చే యాసంగికీ నీళ్లివ్వండి
గత యాసంగిలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో ఐదు లక్షల ఎకరాలు సాగు అయిన విషయాన్ని గుర్తించి, ఈ వానకాలం పంటకు, అలాగే వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్ని రిజర్వాయర్లను, వాటికి అనుసంధానంగా నిర్మించిన కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు అన్నింటినీ నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలిగించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం మోటర్లు వెంటనే ఆన్ చేయాలి ;మంత్రి ఉత్తమ్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కాళేశ్వరం మోటర్లను వెంటనే ఆన్ చేసి, అన్ని రిజర్వాయర్లను, వాటి పరిధిలోని చెరువులను నింపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకెళ్లక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో ఇన్‌ఫ్లో పెరిగిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-6 వద్ద ఉన్న నంది పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్ చేసి.. మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను, వాటి పరిధిలోని చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపి సుమారు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల కాపాడాలని కోరారు.
ఎల్లంపల్లి బరాజ్
ప్రస్తుత పరిస్థితి: దీనిని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినా 5 టీఎంసీలకు మించి నిల్వ చేయలేదు. రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ దీనిని పూర్తిచేశారు. 2016 నుంచే ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల లెవల్ వరకు నీటి నిల్వను ప్రారంభించారు.
నంది రిజర్వాయర్ (ప్యాకేజీ 7)
ధర్మారం మండలం నందిమేడారంలో ఉన్నది. రామడుగు మండలం గాయత్రి (లక్ష్మీపూర్) పంప్‌హౌస్‌కు నీటి తరలింపు కోసం ఇక్కడి పాత చెరువునే రిజర్వాయర్‌గా కేసీఆర్ హయాంలోనే విస్తరించారు. పూర్తిగా వినియోగంలోనే ఉన్నది. బుధవారం సైతం జలాలను తరలించారు.
నంది పంప్‌హౌస్ (ప్యాకేజీ 6)
ఇది కేసీఆర్ నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తొలి భూగర్భ పంప్‌హౌస్. ఇక్కడ 127.6 మెగావాట్ల సామర్థ్యమున్న 7 మోటర్ల ద్వారా నీటిని ఎత్తి 128 మీటర్ల నుంచి 233 మీటర్ల ఎత్తులో ఉన్న నంది రిజర్వాయర్‌లో పోస్తారు. మోటర్లను బీహెచ్ఈఎల్ తయారు చేసింది. ప్రస్తుత పరిస్థితి: సిద్ధంగా ఉన్నది. బుధవారం రోజున 3 పంపుల ద్వారా జలాలను తరలించారు.
గాయత్రి పంప్‌హౌస్ (ప్యాకేజీ 8)
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో భూగర్భంలో కేసీఆర్ హయాంలోనే నిర్మించారు. ఇక్కడినుంచి 139 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులతో 323 మీటర్ల ఎత్తులో శ్రీరాజరాజేశ్వర జలాశయానికి జలాలను తరలిస్తారు. బుధవారం మూడు మోటర్ల ద్వారా జలాలను తరలించారు.