Govt Schools | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 91శాతం సర్కారు స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. 9శాతం స్కూళ్లు మాత్రమే ఆ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 30,023 సర్కారు స్కూళ్లు ఉండగా, కేవలం 2,772(9.23శాతం) మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. మన కన్నా గిరిజన రాష్ర్టాలైన జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు రెండురెట్లు ముందంజలో ఉన్నాయి. జాతీయ సగటులో సగంశాతం స్కూళ్లకు కూడా రాష్ట్రంలో ఇంటర్నెట్ సౌకర్యంలేకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్లో సమాధానమిచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ బడుల్లో డిజిటల్ బోధన.. త్రీడీ పాఠాలు అంటూ ప్రచారం చేసుకుంటున్నది. అసలు ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా డిజిటల్ బోధన, త్రీడీ పాఠాలు ఎలా సాధ్యమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మధ్యాహ్న భోజనం వివరాలు, యూడైస్ అప్డేట్కు ఇంటర్నేట్యే మూలం. కానీ ఆయా సమాచారాన్ని ఆన్లైన్ చేరవేసేందుకు అవసరమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడాన్ని మాత్రం విస్మరించారు.
ప్రైవేట్లోనూ పూర్..
ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంలో ప్రైవేట్ స్కూళ్లు సైతం వెనుకబడే ఉన్నాయి. జాతీయంగా 3,35,844 స్కూళ్లు ఉండగా, 2,00,274 (59.63శాతం) ప్రైవేట్ స్కూళ్లు ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నాయి. తెలంగాణలో12,193 ప్రైవేట్ స్కూళ్లుంటే, 6,917 (56.73%) స్కూళ్లు ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 26.31శాతం, ఛత్తీస్గఢ్లో 57.57శాతం, బీహార్లో 43.14శాతం, ఉత్తర్ప్రదేశ్లోనూ 36.50శాతం ప్రైవేట్ స్కూళ్లు ఇంటర్నెట్ సౌకర్యం కలిగిఉన్నాయి.