‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో నేరుగా పాగా వేస్తున్నారు. బసవతారకనగర్‌లోని నిరుపేదలను తరిమికొట్టేందుకు యత్నించినవాళ్లు.. ఇప్పుడు భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో దిగారు. భూములను డీ నర్సింగరావు తమకు అమ్మాడంటూ పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. రాత్రికి రాత్రి కంటెయినర్లను దింపారు. ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతానికి పనులను నిలిపివేయించారు. కానీ కంటెయినర్లు మాత్రం అక్కడే ఉన్నాయి. రికార్డుపరంగా ప్రభుత్వానికి చెందిన భూములైనా రెవెన్యూ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ప్రభుత్వ పెద్దలను నమ్మి 32 ఎకరాలను వదులుకునేందుకు భాగ్యనగర్ టీఎన్జీవో తీర్మానం చేస్తే చివరికి వారికిస్తామన్న భూముల్లోనే పాగా వేయడం గమనార్హం.
హైదరాబాద్, జూలై 11(స్పెషల్ టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోకు ఇచ్చిన ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు పాగా వేస్తున్నారు. ఉద్యోగులకు జలక్ ఇస్తూ వారి భూముల్లోకి చొరబడ్డారు. కంటెయినర్లను దింపి, పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. సర్వే నంబరు 36లోని 142.11 ఎకరాలు, 37లోని 32.31 ఎకరాలను టీఎన్జీవోలకు గతంలోనే ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేటు వ్యక్తుల రూపంలో తెరవెనుక పెద్దలు ఇందులోని 90 ఎకరాలను కైవసం చేసుకునేందుకు బిగ్‌స్కెచ్ వేశారు. సర్వే నంబరు 37లోని 32.31 ఎకరాలను వదులుకుంటే మిగిలిన 142.11 ఎకరాలకు మార్గం సుగమం చేస్తామని నమ్మించారు. దీంతో ఆ సంఘం ఈ నెల 7న జరిగిన సర్వసభ్య సమావేశంలో 32.31 ఎకరాలను వదులుకుంటూ తీర్మానం చేసినట్టు సమాచారం. ఈ విషయాలను ‘నమస్తే తెలంగాణ’ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ‘బిగ్’ టీం సర్వే నంబర్ 36లోని 142.11 ఎకరాలపై కూడా కన్నేసింది.
ఈ అంశంపై నమస్తే తెలంగాణలో శుక్రవారం కథనం ప్రచురితం అయ్యింది. దానిని నిజం చేస్తూ శుక్రవారం ఉదయం 9 గంటలకు కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 36 లోని భూముల్లో రెండు కంటెయినర్లను దింపారు. భాగ్యనగర్ టీఎన్జీవోలు నియమించిన సెక్యూరిటీ గార్డును బెదిరించి, ఇది తమ భూమి అంటూ హల్చల్ చేశారు. పదుల సంఖ్యలో బీఎండబ్ల్యూ, ఇతర కార్లతో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు ప్రాథమికంగా పనులు కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు అక్కడికి వచ్చి వారిని వారించారు. డీ నర్సింగరావు లేఅవుట్ చేయగా తాము ప్లాటు కొనుగోలు చేశామని, ఇది తమ భూమి అంటూ చెప్పడంతో పోలీసులు భాగ్యనగర్ టీఎన్జీవో ప్రతినిధులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం.. ముందుగా రెవెన్యూ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొని, వారి ఆధ్వర్యంలో భూముల్లోకి రావాలని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటే 142.11 ఎకరాలు దక్కుతుందని ఆశించిన భాగ్యనగర్ టీఎన్జీవోలకు ‘బిగ్’ టీమ్ కుచ్చుటోపీ వేసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
డీ నర్సింగరావు, ఇతరులకు చెందిన భూములు, సర్వేనంబరు 36, 37ల్లో టీఎన్జీవోలకు ఇచ్చిన 189.11 ఎకరాలు ఒకటి కావని 2021లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అయినా ప్రభు త్వ పెద్దల అండతో ఉద్యోగులకు దక్కాల్సిన 90 ఎకరాలను మింగేసేందుకు కసరత్తు జరుగుతున్నది. రికార్డుల పరంగా 189.11 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములపై ఎన్ని వివాదాలున్నా వాటిని రక్షించింది. కొన్నిరోజులుగా ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రెవెన్యూశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. తోటి ఉద్యోగులకు కేటాయించిన భూములను కాపాడాలనే ధ్యాస కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. సర్వేనంబర్ 37లో ఉన్న బసవతారకనగర్‌లోని గుడిసెలను ప్రైవేటు వ్యక్తులు కూల్చుతూ, మాటవినని వారిపై హిజ్రాలతో కూడా దాడి చేయించారు. ఏండ్ల తరబడి ఇక్కడే ఉంటున్నామని వేడుకుంటున్నా వినకుండా గుడిసెవాసులను తన్నితరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడం అంటే తెర వెనక ‘బిగ్’ టీం ఏ మేరకు ఒత్తిడి చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
డీ నర్సింగరావు, ఇతరులకు ఇప్పటికే 30 ఎకరాలకు ఎన్వోసీ ఇచ్చామని కొన్నిరోజుల కిందట శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి చెప్పారు. ఆ ఎన్వోసీలను బయటపెట్టేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాత్రం ఎన్వోసీలను ప్రస్తావించకుండా తాము నివేదికను ప్రభుత్వానికి పంపినట్టు సమాధానమిచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు నిజంగా ఎన్వోసీ ఇచ్చినట్లయితే సర్వే నంబరు 37లోని 30 ఎకరాలను బాజాప్తాగా స్వాధీనం చేసుకోవాలని కదా! అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సర్వే నంబర్ 36లో, అందునా 2010లో జీహెచ్ఎంసీ ఆమోదంతో లేఅవుట్ చేసిన భూములను డీ నర్సింగరావు తమకు విక్రయించాడంటూ ప్రైవేటు వ్యక్తులు వచ్చారంటే వాటికి కూడా రెవెన్యూశాఖ ఎన్వోసీలు ఇచ్చిందా? అని అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇచ్చినట్టయితే అక్కడికి వచ్చిన వారు పోలీసులకు ఆ పత్రాన్ని చూపించాలి, ఒకవేళ ఎన్వోసీ ఇవ్వకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో కంటెయినర్లు ఎలా వేస్తారని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయాలి, కానీ ఇవేమీ జరగడం లేదు.