BRS | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్!’ ఇదీ తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయమని తెలుస్తున్నది. గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన 88 స్థానాల కన్నా అదనంగా రెండు సీట్లు సొంతం చేసుకొని ఏకంగా 90 స్థానాలతో బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా దక్షిణభారతదేశంలో సరికొత్త రికార్డును సృష్టించబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందునుంచి వెలువడుతున్న సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. దాదాపు అన్ని సర్వేలు ‘తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు ఎదురులేదు.. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు’ అని స్పష్టం చేశాయి.
ప్రజాభీష్టానికి భిన్నంగా బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు సృష్టిస్తున్న ‘మౌత్‌టాక్ వట్టి మౌత్వాషే’నని తెలంగాణ ప్రజలు విస్పష్టం చేయనున్నారని పేర్కొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్కు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంటూ సామాజిక మాధ్యమాలను నడుపుతున్నవారు సైతం క్షేత్రస్థాయిలో ప్రజా స్పందనను చూసి చేతులెత్తేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, 2018 ఎన్నికల్లో 88 స్థానాలను సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఈసారి ఏకంగా 90 స్థానాలను సాధించి.. తన రికార్డును తానే బ్రేక్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే దరికి చేరుతున్న క్రమంలో రాష్ట్ర ప్రజలు రిస్క్ తీసుకొని రాష్ర్టాన్ని మరొకరి చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేరని తేలిపోతున్నది.
హైదరాబాద్ మహానగరం పరిధిలోని 22 స్థానాల్లో, ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతున్నదని సర్వే సంస్థలు నిగ్గుతేలుస్తున్నాయి. ఇప్పటికే 60కి పైచిలుకు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తిరుగులేని ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక త్రిముఖ పోటీ ఉన్న 15 నియోజకవర్గాలు, ద్విముఖ పోటీ ఉన్న 25 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏ లెక్కచూసినా మొత్తం 90 స్థానాలతో బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి విజయదుందుభి మోగించనున్నదనే సంకేతాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
ప్రజాబాహుళ్య దర్పణం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 86 ప్రజా ఆశీర్వాదసభలు నిర్వహించారు. ఈ సభలకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. వచ్చాం కాబట్టి విని ఊరుకుందాం అన్న రీతిలో కాకుండా సీఎం కేసీఆర్ చెప్పే ప్రతి మాటకు జోరుగా స్పందిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు జై తెలంగాణ అంటూ నినదిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సభలే అయినా ఉద్యమకాలం నాటి సన్నివేశాలను ఆవిష్కరిస్తున్నాయి. బోనాలు.. బతుకమ్మలతో మహిళలు సభలకు పోటెత్తుతూ ఉద్యమస్ఫూర్తిని చాటుతున్నారు. ఈ సభలకు వస్తున్న జనం తిరిగి ఇండ్లల్లోకి వెళుతూ, వెళ్లిన తరువాత ‘కేసీఆర్ చెప్పింది నిజమా? అబద్ధమా?’ అంటూ.. వాడకట్టులో, కుల సంఘాల వారీగా జమకూడి చర్చిస్తున్నారు. ఫలితంగానే బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం లభించనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మైనార్టీలు.. దళితులు బీఆర్ఎస్తో లేరనటం సత్యదూరం
బీఆర్ఎస్కు ఈసారి మైనార్టీలు, దళితులు దూరమయ్యారని కాంగ్రెస్ చెప్తున్నది పచ్చి అబద్ధమని తెలుస్తున్నది. దళితుల్లో అందరికీ దళితబంధు రాలేదని, ఈ కారణంతో ఆ వర్గం మొత్తం తమకే అనుకూలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది మైండ్‌గేమ్ అని వారికి అర్థమైపోయింది. మూడోసారి ప్రభుత్వం రాగానే హుజూరాబాద్ మాదిరిగా నియోజకవర్గం అంతా దళితబంధు ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీపై ఆ వర్గాల్లో భరోసా పెరిగింది. మైనార్టీల విషయంలో కూడా కాంగ్రెస్ ఆడుతున్నది మైండ్‌గేమ్‌ను అది ఆ వర్గాలకు తెలిసిపోయింది. తెలంగాణలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. దీంతో ఆ వర్గం ఇప్పటికే అనేక చోట్ల బయటికి వచ్చి బీఆర్ఎస్ ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
దింపుడుకల్లం ఆశలో దిగుబడి నేతలు
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాదరణ ముందు ఢిల్లీ, బెంగళూరు శిబిరాలు కకావికలం అవుతున్నాయి. నిన్నటిదాకా అంతా తమ చేతుల్లోనే ఉందనుకొని నింపాదిగా చక్రాలు తిప్పిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా సహా బీజేపీ అగ్రనాయకత్వం, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ తదితరులు తెలంగాణ గడ్డ మీద వాలిపోయారు. ఇక రేవంత్‌రెడ్డి పేల్చుతున్న డైలాగ్‌లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. రేవంత్ ఎంత తిరగకపోతే అంతమంచిది అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖం మీదే చెప్పేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాబలం, పార్టీ బలం, స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ముందు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న గారడీలు తెలిసిపోయి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ముచ్చటగా మూడోసారి 90 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టనున్నారని సర్వేలు తెలుపుతున్నాయి.