Ganja | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ప్రకృతి రమణీయతకు నెలవైన ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఆ కంపు దేశంలోని అన్ని రాష్ర్టాలకూ విస్తరిస్తున్నది. దీంతో ఎంతో మంది యువత ఆ మత్తుకు బానిసలై చిత్తవుతున్నారు. ఉజ్వలమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మత్తు మూలాలను కూకటివేళ్లతో పెకలించడంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. స్కూలు పిల్లలు తినే చాక్లెట్ల నుంచి పెద్దలు కాల్చే సిగరెట్ల వరకూ అన్నింటిలోనూ గంజాయి చొరబడటంతో ఇప్పటి నుంచే పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా త్వరలో అన్ని రాష్ర్టాల పోలీసు, ఎక్సైజ్ విభాగాలతో జట్టు కట్టాలని భావిస్తున్నది. ఏఓబీ నుంచి ఇతర రాష్ర్టాలకు అక్రమంగా గంజాయిని తరలించేందుకు కీలకంగా ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో స్మగ్లర్లపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నది. దేశంలో 90% గంజాయి ఏవోబీలోనే ఉత్పత్తి అవుతుండటంతో దాన్ని కట్టడి చేయడంలో ఆంధ్రా, ఒడిశా అధికారుల సహకారాన్ని తీసుకునేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమవుతున్నారు.
15 వేల ఎకరాల్లో గంజాయి సాగు
గంజాయి ఉత్పత్తికి ఏవోబీ కేరాఫ్‌గా మారడంతో సరిహద్దు రాష్ర్టాల పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10 వేల నుంచి 15 వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్టు అంచనా. ఏవోబీలో గంజాయి సాగుకు భౌగోళిక, వాతావరణ పరిస్థితులు అనువుగా ఉండటంతోపాటు మావోయిస్టులు సంచరించే ప్రాంతం కావడంతో స్మగ్లర్లు ఆ ప్రాంతాన్నే తమ అడ్డాగా చేసుకుంటున్నారు. ఏవోబీలోని ప్రతి గ్రామంలో వరి, పసుపు, కంది, శనగ, మినప, పెసర పంటలకు తోడుగా గంజాయి మొక్కలను పెంచుతున్నారని, సాధారణ పంటల కంటే గంజాయి సాగు ఎంతో లాభసాటిగా ఉండటమే ఇందుకు కారణమని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు.
హాట్స్పాట్లుగా ఢిల్లీ, గుజరాత్
ఏఓబీ నుంచి తొలుత చింతూరు-భద్రాచలం మీదుగా తెలంగాణకు గంజాయిని తరలిస్తున్న స్మగ్లర్లు.. ఇక్కడి నుంచి ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కేరళ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్, సికిం, నాగాలాండ్ తదితర రాష్ర్టాలకు అధికంగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్టు అధికారులు చెప్తున్నారు.
అది రెండు రాష్ర్టాలకు సరిహద్దు. ఆదివాసీలు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా దట్టమైన అడవులు, కొండలు, లోయలే. ప్రకృతి సౌందర్యానికి నెలవైన ఆ ప్రాంతం ఇప్పుడు గంజాయి ఉత్పత్తికి అడ్డాగా మారింది. దేశంలో 90% గంజాయి అక్కడే ఉత్పత్తి అవుతున్నది. దేశంలోని అన్ని రాష్ర్టాలకు అక్కడి నుంచే అక్రమంగా గంజాయి రవాణా అవుతున్నది. అదే ఆంధ్రా-ఒడిశా బోర్డర్. సంక్షిప్తంగా ఏవోబీ.