ధారూరు/అందోల్/మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 3: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జరిగిన ఈ ఘటనల వివరాలిలా.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మదునంతపూర్ తండావాసులు రేగొండి గ్రామానికి చెందిన జమీల్ ఆటోలో వికారాబాద్‌కు బయల్దేరారు. కెరెళ్లి (బాచారం) సమీపంలోని రైతువేదిక వద్ద వికారాబాద్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న లారీ-ఆటోను ఢీకొట్టింది. ఆటోలో 11 మంది ఉండగా, హేమ్లానాయక్ (45), రవి (40), డ్రైవర్ జమీల్ (34) అక్కడికక్కడే మృతి చెందారు. దవాఖానకు తరలిస్తుండగా కిషన్(45) మృతి చెందా డు. క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. ఇందులో వినోద్(30) రాత్రి మరణించాడు. ఈ ఘటనపై మంత్రి సబితారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కొంప ముంచిన పొగమంచు
మహారాష్ట్రలోని డెగ్లూర్ ప్రాంతానికి చెందిన దిలీప్(50), వినోద (45) భార్యాభర్తలు. వీరి కూతురు సుప్రతి (25), మనుమరాలు కాంక్ష్య (2)తో కలిసి హైదరాబాద్‌లోని జీడిమెట్లలో నివాసం ఉంటున్నారు. బుధవారం తమ స్వగ్రామంలో ఫంక్షన్ ఉండటంతో కారులో వెళ్లి గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సంగారెడ్డి జిల్లా కన్సాన్పల్లి శివారుకు చేరుకోగానే వీరి కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొన్నది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉండటతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
ఇంకో ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు మహబూబ్‌నగర్ రూరల్ మండలం దివిటిపల్లి వద్ద జాతీయ రహదారి-44పై గురువారం తెల్లవారుజామున బోల్తా పడింది. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డ్రైవర్ రామాంజనేయులు సడన్ బ్రేక్ వేయడంతో బస్సు బోల్తాపడినట్టు సమాచారం.