హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని వర్షం ముంచెత్తుతున్నది. జూలైలో సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక చాలు బాబోయ్.. ఇక వద్దు అనేంతగా వాన పడటం విశేషం. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోనూ అధిక వర్షం కురిసింది. 99.50 శాతం మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండాయి. చెరువులు అలుగు పోశాయి. వాగుల్లో భారీ నీటి ప్రవాహం రికార్డయ్యింది.
పంటలకు పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చింది. భూగర్భ జలాలు పెరిగాయి. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన జూన్ 1 నుంచి జూలై 30 వరకు రాష్ట్ర సాధారణ వర్షపాతం 367.80 మిల్లీమీటర్లు కాగా, 687.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే సుమారు 87 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్నమాట. కేవలం 3 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 26 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో సాధారణం కన్నా కనీసం 60 శాతం కంటే ఎక్కువ వర్షం కురిసింది. 7 జిల్లాల్లో సాధారణం కంటే 20 నుంచి 60 శాతం ఎక్కువగా వర్షపాతం రికార్డయ్యింది. వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో అధిక వర్షం కురింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా, ఖమ్మం జిల్లాలో అతి తక్కువగా వర్షం పడింది. నెలవారీగా చూసుకొంటే జూన్‌లో సాధారణ వర్షపాతం కన్నా 16 శాతం మాత్రమే అధికంగా కురువగా, జూలైలో ఏకంగా 125 శాతం అధిక వర్షం కురిసింది. జూలైలో సాధారణ వర్షపాతం 244.40 మిల్లీమీటర్ల కాగా, 536.70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వివరించారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపారు. సోమవారం సైతం కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించారు. ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ నుంచి 3.1 కిలోమీటర్ ఎత్తు మధ్య విస్తరించి ఉన్నదని చెప్పారు.