Rythu Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): రైతుభరోసాలో 8,500 సర్వే నంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఈ సర్వే నంబర్ల కింద సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు తెలిసింది. ఈ సర్వే నంబర్లు గల రైతుల పేర్లపై వాస్తవంగా ఉండాల్సిన భూమి కన్నా ఎక్కువ భూమి ఉన్నట్టు సర్వేలో గుర్తించినట్టు సమాచారం. దీంతో ఒక సర్వే నంబర్లో ఉండాల్సిన భూమి కన్నా ఎక్కువ భూమి ఏవిధంగా ఉంటుందనే సందేహంతో ఈ భూములను తాత్కాలింగా బ్లాక్‌లిస్టులో పెట్టినట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సర్వే నంబర్లు గల రైతులకు రైతుభరోసాను బంద్ చేసినట్టు తెలిసింది.
నంబర్లు బ్లాక్.. రైతులు ఆగం
ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే నంబర్లను బ్లాక్ చేసి రైతుభరోసా వేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే మూడెకరాల వరకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మూడెకరాల లోపు గల వారికి కూడా రైతుభరోసా జమ కాకపోవడంతో సదరు రైతులు ఏఈవోల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమకు రైతుభరోసా ఎందుకు రాలేదని ఆరా తీస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెబ్సైట్లో పరిశీలించగా ఆ సర్వే నంబర్లను చూపించడం లేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సర్వే నంబర్లు బ్లాక్ చేయడంతో ఈ రైతులకు రైతుభరోసా రావడం లేదు. అయితే, ఈ రైతులకు రైతుభరోసా ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం అయోమయంలో ఉన్నట్టు తెలిసింది. వీటిని మళ్లీ సర్వే చేసి ఎక్కువ భూమిపై సమీక్షిద్దామా? ఈసారికి రైతుభరోసా ఇచ్చేద్దామా? అనే అంశంపై చర్చిస్తున్నట్టు తెలిసింది.
జరిగింది ఇదీ..
రైతుభరోసా జమ చేసే క్రమంలో సర్వే నంబర్ల వారీగా, రైతుల పాస్‌పుస్తకాల వారీగా భూ వివరాలను రెవెన్యూ శాఖ పోల్చి చూసినట్టు సమాచారం. ఇందులో సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమితో పోల్చితే పాస్ పుస్తకాల్లో అధిక భూమి ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది. ఉదాహరణకు ఒక సర్వే నంబర్లో పాత సర్వే ప్రకారం 10 ఎకరాలు ఉండగా, ఆ భూమి ఇతర రైతుల పేర్లపై మారగా సర్వే నంబర్లు బై నంబర్లుగా మారాయి. అయితే ఇప్పుడు ఆ నంబర్లన్నింటినీ పరిశీలించగా ఆ సర్వే నంబర్లో 12 ఎకరాల భూమి ఉన్నట్టుగా రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారని తెలిసింది. ఎక్కువగా వచ్చిన ఈ రెండెకరాల భూమి ఎక్కడిదనే అంశంపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా వాస్తవ భూమి కన్నా ఎక్కువ భూమిని గుర్తించిన సర్వే నంబర్లను బ్లాక్ చేసినట్టు తెలిసింది.